మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇటీవల ఫార్ములా-ఈ-కార్ కేసులో ఢిల్లీ ఈడీ నుంచి నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ నోటీసులపై ఆయన తీవ్రంగా స్పందించారు. అవినీతికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసు మీద ఎక్కడినుంచి ఆరోపణలు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. అసలు ఈ కేసు “లొట్టపీసు కేసు”గా ఆయన అభివర్ణించారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తప్పని, కానీ ఫార్ములా-ఈ-కార్ కేసులో ఎలాంటి మోసం లేదని వ్యాఖ్యానించారు. హైకోర్టు న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు ఏజీ వద్ద సమాధానాలు లేకపోవడం పై ఎద్దేవా చేశారు. ఆయన తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ఉద్దేశ్యంతో నడిపించబడుతున్నాయనీ, ప్రభుత్వం తనను జైలుకు పంపాలని చూస్తుందని తీవ్ర విమర్శలు చేశారు.
ఫార్ములా రేసు నిర్వహణ తన నిర్ణయమని, రేవంత్ రెడ్డి మాత్రం రేసు వద్దు అనడమే తన నిర్ణయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ 2025లో జాతీయ రాజకీయాలపై మరింత దృష్టి పెట్టి, ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ప్రణాళికలు వేసింది. ఈ సభ ద్వారా ప్రజలకు పార్టీని మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ అద్భుత ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.