తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరొక శుభవార్త అందించింది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి అనుమతి ఇచ్చేందుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకే మామునూరు విమానాశ్రయానికి కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా, రాష్ట్రంలో మరో విమానాశ్రయానికి భారత వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్ ప్రజలతో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకూ ఇది విశేషమైన వార్తగా మారిందని ఆయన తెలిపారు.ఇంతకుముందు మామునూరు విమానాశ్రయానికి అనుమతులు పొందిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు ఆదిలాబాద్ విమానాశ్రయానికి కూడా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రెండు విమానాశ్రయాలకు కేంద్రం అనుమతులు మంజూరు చేయడం, రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనమని మంత్రి వెంకటరెడ్డి పేర్కొన్నారు.ఈ విమానాశ్రయాన్ని పౌర విమానాల రాకపోకలతో పాటు, ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని భారత వాయుసేన సూచించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు అవసరమైన భూమిని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (AAI) అప్పగించాలని సంబంధిత అధికారులకు లేఖ ద్వారా తెలియజేసినట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు మంత్రి వెంకటరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రం నుంచి మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.