కోల్‌కతా : కోల్‌కతాలో ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు పై బంగాల్‌లోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించనుంది. గత ఏడాది ఆగస్టు 9న ఈ హత్యాచార ఘటన జరగ్గా, ఆ మరుసటి రోజే ప్రధాన నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసింది.

నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని న్యాయస్థానంలో సీబీఐ వాదించింది. డీఎన్ఏ రిపోర్టులు సహా అనేక ఆధారాలను న్యాయస్థానం ముందు సీబీఐ ఉంచింది. సంజయ్ రాయ్ తరఫు న్యాయవాదులు మాత్రం తమ క్లయింట్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి ఈ కేసులో ఇరికించారని వాదించారు. జనవరి 9న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.
మరోవైపు హత్యాచార కేసులో తీర్పు రానున్న వేళ బాధితురాలి తల్లిదండ్రులు దర్యాప్తు సగమే జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇతర నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. సంజయ్‌రాయ్ తప్పు చేశాడని , కోర్టు అతడికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తుందని, అయితే ఇతర నేరస్థుల మాట ఏంటని బాధితురాలి తల్లి ప్రశ్నించారు. దర్యాప్తు సగమే పూర్తైందని ఆమె అన్నారు. ఈ నేరంలో ఇతరుల పాత్ర బయటపడకుండా యంత్రాంగం అడ్డుపడుతోందని అనుమానం వ్యక్తం చేశారు.