Kishan Reddy : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. షెడ్యూలు ప్రకారం సికింద్రాబాద్‌లో సాయంత్రం జరిగే బిహార్ దివస్‌లో ఆయన పాల్గొనాల్సి ఉండగా.. దాన్ని రద్దు చేసుకొని హస్తినకు వెళ్లారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు జరుగుతున్న క్రమంలో ఉన్నపళంగా ఆయన ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ విధంగా కార్యక్రమాన్ని రద్దు చేసుకొని కిషన్ వెళ్లి ఉంటారనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఆ కీలక అంశం ఏమిటి ? తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక విషయమా ? బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో కిషన్ రెడ్డి ఉన్న విషయమా ? వక్ఫ్ బిల్లు విషయమా ? దక్షిణాది రాష్ట్రాలను కుదిపేస్తున్న నియోజకవర్గాల పునర్విభజన అంశమా ? అనేది తెలియాల్సి ఉంది.

ఆయా అంశాలపై చర్చించేందుకు
ఇక, ఇతరత్రా కారణాలతోనూ ఢిల్లీకి కిషన్ రెడ్డి వెళ్లి ఉండొచ్చు. నేటి(సోమవారం) నుంచి కీలకమైన పార్లమెంటు సెషన్ జరగబోతోంది. ఇందులో వక్ఫ్ సహా పలు అంశాలకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రాధాన్యమున్న బిల్లులపై ఓటింగ్, చర్చ వంటివి ఉన్నప్పుడు తప్పకుండా కేంద్ర మంత్రులు పార్లమెంటులో అందుబాటులో ఉండాలి. ఆయా అంశాలపై చర్చించేందుకు మంత్రి మండలి సమావేశాలు సైతం జరుగుతుంటాయి. వివిధ అంశాలపై లోక్‌సభలోని విపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. బహుశా అందుకే కిషన్ రెడ్డి ఢిల్లీకి హుటాహుటిన వెళ్లి ఉంటారని కొందరు అంటున్నారు.