Kishan Reddy : హెచ్‌సీయూ వద్ద ప్రభుత్వానికి దక్కిన 400 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతూనే ఉంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం నిర్ణయం పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈక్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ భూములను వేలం వేయొద్దని సూచించారు. హెచ్‌సీయూలో 400 ఎకరాల భూముల వేలాన్ని విరమించుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. గతంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

ఈ భూమిలో ఎలాంటి బఫెలో లేక్ , పికాక్ లేక్ లాంటివి లేవు
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వం భూమి అని దీనికి హెచ్‌సీయూకి సంబంధం లేదని మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ భూమిలో ఎలాంటి బఫెలో లేక్ , పికాక్ లేక్ లాంటివి లేవని స్పష్టం చేశారు. రాతి నిర్మాణాలు, పుట్టగొడుగు ఆకారపు అపురూపమైన రాయిని గ్రీన్ జోన్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బడ్జెట్ డిస్కషన్ సందర్భంగా ఈ గచ్చిబౌలిలో వివాదాస్పద భూమిపై మాట్లాడారు.
దానిని డెవలప్‌మెంట్‌కు వాడుకుంటే తప్పేంటీ
అక్కడ ఐటీ, ఇతర పరిశ్రమలు వచ్చేలా చేస్తున్నామని తెలిపారు. అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ లేదని జింకలు, పులులు, సింహాలు లేవని తెలిపారు. కానీ అక్కడ కొన్ని గుంట నక్కలు చేరి ఇలా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దానిని డెవలప్‌మెంట్‌కు వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. గుట్టుగా ఎవరికీ కట్టబెట్టలేదని ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చేలా చేస్తున్నామని వివరించారు. యూనివర్సిటీ పిల్లలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి సంబంధించి విషయాల్లో భూసేకరణ చేస్తే అడ్డంకులు సృష్టించొద్దని సూచించారు.