విశ్వజిత్ యు.కె.జి. చదువుతున్నాడు. మధ్యాహ్నం కాన్వెంట్ అవగానే ఇంటికి తీసుకొచ్చాడు హేమచంద్ర. తరగతిలో నేర్చుకున్నది అమ్మకు చెప్పాలని సంబరంగా ఇంట్లోకొచ్చాడు విశ్వజిత్, స్వప్న కొడుకుని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటుంటే, “అమ్మా, అమ్మా… మరే.. మరే.. తొండను ఇంగ్లీష్ లో ఏమంటారో నీకు తెలుసా?” అని అడిగాడు.
“అయ్యో, తెలీదు నాన్నా, నువ్వే చెప్పు” రోజూలానే అడిగింది. “ఏమంటారంటే.. ఏమంటారంటే.. ‘గార్డెన్ లిజార్డ్’ తనకే తెలుసున్నట్లు గర్వంగా చెప్పాడు. “వావ్…వెరీ గుడ్. ఇలానే రోజూ ఒకటి నేర్చుకోవాలి. ఒకేనా! వెళ్లి కాళ్లూ, చేతులూ కడుక్కుని రా, అన్నం పెడతాను” మెచ్చుకుంటూ వంటింట్లోకి వెళ్లింది. తండ్రీ, కొడుకులిద్దరూ కాళ్లూ, చేతులు కడుక్కుని డైనింగ్ టేబుల్ 2. దగ్గర కూర్చున్నారు.

భోజనం వడ్డిస్తుండగా ఫోన్ మోగితే ఎత్తింది స్వప్న. “హలో.. సంకల్ప్వాళ్ల మదర్నా.. హాయ్ అండి, చెప్పండి!” అంది స్వప్న. “విశ్వజిత్, సంకల్స్కి కోడిగుడ్డు పెట్టాడటండీ! మీరేమైనా బాక్సులో వేసి పంపారా?” అడిగిందామె. “అవునండీ. ” అది పౌష్టికాహారం కదా.
పెట్టమని డాక్టర్లు, టీచర్లు చెప్తున్నారు కదా. అందుకే రోజూ ఉదయమే తినేసి వస్తాడు. ఈరోజు ఆలస్యమైందని బాక్సులో వేసి పంపాను. ఏమైందండీ?” సంకోచిస్తూ అడిగింది స్వప్న. “మీ ఇంట్లో తినమనండి..” అందామె. విషయం అర్థమై, “సరేనండి… ఇకపై జాగ్రత్త పడతాను. ఏమీ అనుకోకండి!” అని చెప్పి కొడుక్కి ఎలా చెప్పాలోనని ఆలోచించింది స్వప్న.
“సంకల్స్కి కోడిగుడ్డు పెట్టావా విశ్వజిత్?” అడిగింది స్వప్న. “నేను తింటుంటే అడిగాడమ్మా. ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలని నువ్వు చెప్పావుగా, అందుకే పెట్టాను” ఒకప్పుడు అమ్మ చెప్పిన మాటను గుర్తు చేస్తూ బదులిచ్చాడు విశ్వజిత్. “వెరీగుడ్ నాన్నా.. మంచి పని చేశావ్.
అయితే కోడిగుడ్డును, చికెన్ ను కొంతమంది తినరు. మనం పెట్టకూడదు కూడా” వివరిస్తోంది స్వప్న. “ఎందుకు వద్దంటుందోనని” అమ్మకేసి చూశాడు విశ్వజిత్. “అవి తింటున్నప్పుడు ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుంది. సంకల్ప్ మంచి ఫుడ్ తిన్నాడు.

అందుకే బలంగా వున్నాడు. నువ్వేమో సరిగ్గా తినవు. బలంగా లేవు. నీకెక్కువ బలం రావాలంటే నువ్వే తినాలి. సరేనా?” అర్థమయ్యేలా చెప్పింది స్వప్న. “సరేనంటూ” తలూపి చేయి, నోరు కడుక్కోవడానికి సింక్ దగ్గరికెళ్లాడు విశ్వజిత్. “ఎందుకలా చెప్పావు? వాళ్లు ‘ఫలానా’ అని, వాళ్లు నాన్ వెజ్ తినరని చెప్పొచ్చు కదా!” అన్నాడు హేమచంద్ర.
“మొక్కై వంగనిది మానై వంగదని ఊరికే అనలేదు. ఆ ‘ఫలానా’ల గురించి పసివయసులో చెప్పడం ఎందుకండీ? బాక్సులో నాన్ వెజ్ పెట్టకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి” సూక్ష్మంగా చెప్పింది స్వప్న. “నిజమే! పిల్లలకు తల్లే ఆదిగురువు. గురువులెప్పుడూ సన్మార్గాన్నే చూపిస్తారు!” అని అనుకున్నాడు హేమచంద్ర.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: