हिन्दी | Epaper
చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం

Holy musical sound : రాగ ప్రణవం

Abhinav
Holy musical sound : రాగ ప్రణవం

ఇంతక్రితమే యింటికి వచ్చి తయారై బాల్కనీలో అలవాటుగా కళ్లు మూసుకుని సేద తీరుతున్నాను. మనసెక్కడికో షికారు కెళ్లినట్లుంది. శూన్యమనస్కుడనై అలానే వుండిపోయాను. వంటింట్లోంచి వినవచ్చే శబ్దాలకు లయగా తలపుల్లోంచి కాఫీ కళ్ల ముందు అయాచితంగా ఆవిష్కృతమైంది. అనుకోని ఈ కాఫీ ఉత్పాతమేమిటో అవగతమయ్యేసరికి ఎక్కడో చదివిన లేనిదాన్ని భావించగలగడం ఊహ. ఇంతవరకూ బాగానే వున్నట్లుంది. మరైతే ఉన్నదాన్ని భావించగలగడం ఎలా? అన్నదే ప్రశ్న. ఎందుకంటే కంటికెదురుగా కనిపిస్తున్న ప్పుడు లేదా కనులు మూసుకున్నా ఎదురుగా దృగ్గోచరమౌతున్నప్పుడు అలా ఉన్నదాన్ని భావించడమనేదాన్నే బహుశా ధ్యానమంటారేమో! కనబడని దైవాన్ని ఉన్నట్లుగా భావిస్తూ ధ్యానించడం నవ విధ ఆరాధనలలో ముఖ్యమైనది ధ్యానమే గదా. ఎప్పుడొచ్చిందో ఏమో (మనసు) వస్తూనే మరింత కంగాళీ చేసి పడేస్తోంది వాతావరణాన్ని. అందుకనే ఏదైనా ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమింపగలగడమనేది, భావించగలగడమనేది మనకు అబ్బని విద్యన్నది తెలిపింది. పైనెక్కడో తథాస్తు దేవతలున్నట్లున్నారు. యింతకుముందే తలపుల్లో మెరసిన దానికనుగుణంగా చక్కటి కాఫీ సువాసనలు నిజంగా నా ముక్కుపుటాలను సుతారంగా తాకడంతో, ఆ కాఫీ ఏదో సమక్షంలో కొచ్చేముందు ఆ సువాసనలు ప్రసరించే వంటింట్లోకి ప్రవేశించాను. గమ్మంలోనే ఎందుకనో ఒక్క క్షణమాగాను.

అప్పుడే పైనుంచి ఏదో సీసా తీస్తూ, తనలో తానే మెల్లగా నవ్వుకోవడం గమనించిట్లుగా సూచిస్తూ “దేవిగారెందులకో యీవేళ సుప్రసన్నంగా వున్నారు. పైగా మీలో మీరే అటుతిరిగి నవ్వుకుంటున్నారెందుకో? ఏమిటో విశేషమంటూ భుజాలపై చేతులు వేస్తూ ముక్కుతో మెడవెనుక మెల్లగా రాశాను. మరు నిమిషంలో భుజాలు నిమురుతూ, పెదిమలు మెల్లగా చెవికిందులుగా అద్దాను చిన్నగా కదలిక శరీరంలోనూ, యిరువురి మనసులలోనూ, వెనువెంటనే ప్రస్తుతానికొచ్చిన దేవి మెల్లగా మాట్లాడుతున్నా, నిర్దిష్టంగా దిశా నిర్దేశం చేస్తూ హెచ్చరిస్తూ సమయాన్ని, వాస్తవాన్ని గమనించమని సూచిస్తూ “ముందు మీరు మంచి బాలుళ్లా వెళ్లి కూర్చోండి. నేను కాఫీ పట్టుకునొస్తాను, ఈ లోపులో పిల్లలు వచ్చేస్తారు” అంది నిర్ద్వందంగా పెదిమలు బిగించి ఒకింత అటు కదిలి ఓరకంటితో చిలిపిగానూ, మరంతే యిప్పటికింతే నన్నట్లుగా నాకేసి గారంగానూ చూస్తూ. ఇక తప్పేదేముంది.. ఆమె అన్నదాంట్లో తప్పేముంది.. అనుకుంటూ బయటకు వచ్చాను. అప్పటికి ప్రశాంత్ ఇంజినీరింగ్ మూడవ, అమ్మాయి ప్రశాంతి డిగ్రీ మొదటి చదువుతున్నారు. బ్యాంక్లోలో క్యాషియర్గా తను, సమాచార మార్పిడీ, నివేదనా, పరిశీలనా, పరిశోధనలు సాగించే సంస్థలో ముఖ్య అధికారిగా, బృంద నాయకుడిగా ఏక కాలంలో విధి నిర్వహణలో నేనూ కొనసాగుతున్నాం ప్రస్తుతానికి. రెండు గ్లాసులలోని వేడి వేడి కాఫీని టీపాయ్ మీద పెడుతూ చీకటి వెలుగులతో కూడిన సిల్హౌటీ వెలుతురు నీడలను ఆస్వాదిస్తోంది మౌనంగా నా కళ్లలోకి చూస్తూ.

పెదిమలు చిరునవ్వు నవ్వుతున్నాయి. నుదుటికిరుపక్కలుగా, కపోలాల మీంచి మెలితిరిగిన కురులు చెవుల ముందు వరకూ వచ్చి పంకా గాలికి మెల్లగా కదులుతూ ఏవో అంతుచిక్కని సంజ్ఞాసంకేతాలనిస్తున్న ట్లున్నాయి. నాసిక కుడి వైపున వున్న వజ్రపు ముక్కుపుడక ఆ కనుచీకల్లో తన సహజమైన వెలుగులనిస్తోంది. మందారాలు పూసినట్లున్న బుగ్గలూ, తలలో తురిమిన మల్లెలు ప్రసరించే వెన్నెల వెలుగులూ యిదంతా నిజమేనన్నట్లుగా మంద్రంగా వీస్తున్న గాలులూ, పెదవులపై మెరసిన ఏవేవో జ్ఞా పకాల నిజాల నిజాలు. కళ్లల్లో మెరిసే వెన్నెల వెలుగులు. “ప్రశాంతి మన వీధిగుమ్మం దగ్గరే ఎదురు అపార్ట్మెంట్లో వుంటున్న తన క్లాస్మేట్ మాధురితో ముచ్చట్లాడుతోంది. ప్రశాంతేమో తను వస్తున్న కాలేజీ బస్లో ఏదో సమస్య వచ్చిందట, యింకా బాగుపడలేదట. అందుకని శివం దగ్గరుంటున్న తన క్లాస్మేట్ కారులో వచ్చేశాట్ట. అక్కడనుంచి నడుచుకుంటూ వస్తున్నానంటూ” యింతక్రితమే మాట్లాడాడు. పిల్లలిద్దరూ వస్తూనే రజనీకాంత్ స్టైల్లో బేగ్ లు రెండూ చెరో చోటకూ, వాటిల్లోని ఖాళీ డబ్బాలు సింక్ లోనూ, మంచినీళ్ల సీసాలు ఫ్రిజ్ దగ్గరా, కాళ్లు విసరుతూనో, విదిలిస్తూనో చెప్పులూ, బూట్లూ మరో చోటకూ విసిరేసి, తయారవడంకోసమంటూ వాళ్ల వాళ్ల గదుల్లోకి వెళ్లిపోయారు. అవును.. ఆ తర్వాతెప్పుడో వాళ్లే అవన్నీ సర్దుకోవాలి, సర్దుకుంటారు. ఆ తర్వాత తంతంతా సిత్రాసిత్రాలుగా పిల్లలిద్దరూ తినడానికీ, తాగడానికంటూ యింతకుముందే చేసుం చిన, అది ఏమిటనేది ఎవరికీ పట్టదు. 

ప్రత్యేకంగా యిదే కావాలని పిల్లలెప్పుడూ అడిగినట్లు ఎటువంటి ఫిర్యాదూ రాలేదు. కానీ వాటిని ఆప్యాయంగా దగ్గర కూర్చుని తినిపించడం చూడవల్సిందే తప్ప మాటలకందని భావం.. అది తల్లికి మాత్రమే తెలిసిన విద్య, చాతుర్యం. ఇప్పటికీ పిల్లలిద్దరికీ తనే ముద్దలు చేసి పెట్టడం ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా వాళ్లకలా తినిపిస్తేనే తృప్తిగా వుంటుందం టారు. అంతేకాకుండా తల్లిగా తనక్కూడా బాగుంటుందని, పైగా అలా దగ్గర కూర్చు ని తినిపించడం వల్ల ఒక ముద్ద ఎక్కువే తింటారనీ, అది వాళ్ల ఎదుగుదలకు మంచిదని చాలాసార్లు వక్కాణించిందా మాతృమూర్తి. నేనా సమయంలో మౌనంగానూ, అపురూ పంగానూ, అబ్బురపడుతూ ఆ చిత్రాన్ని కళ్ల చిత్రకళాశాలలో భప్రదరుస్తుంటాను. ఒకింత సరళంగా చెప్పాలంటే కళ్లప్పగించి చూస్తుంటాను, పొయిటిగ్గా చెప్పాలంటే పర్యవేక్షిస్తుంటానంటే కొంచెం స్కోత్కర్షగా వుంటుందనిపించింది కూడానూ. ఇంక ఉదయాల్లోని హడావుడి ప్రత్యేకంగా చూడతగ్గదౌతుంది. ఎందుకంటే ప్రశాంతిని తయారు చేస్తూ, అదే చేత్తో ప్రశాంత్కు తల దువ్వడమనే కార్యక్రమం ఎన్నదగింది. కాలేజీలకెళ్లే ప్రాయం వచ్చినా, యింకా ముఖ్యంగా చెప్పుకోదగిందేమిటంటే పిల్లలిద్దరూ అచ్చం వాళ్లమ్మ చెప్పినట్లుగా వింటుంటారు. ప్రత్యేకంగా ఫేషన్లంటూ వేషాలేమీ వుండవు. ప్రశాంతి చక్కగా రెండు జడలు వేయించుకుని ముచ్చటగా తయారవుతుంది. మరింక ప్రశాంతతైతే మరీనూ, వాళ్లక్కావలసిన బట్టలెప్పుడూ వాళ్లమ్మే కొంటూంటుంది.

అప్పుడే రెండు సంవత్సరాలైంది. పెద్ద తిరుపతెళ్లి. క్రితంసారి వేసవి సెలవుల్లో వెళ్లాం. కలియుగంలో సప్తస్వరాలే గిరి ప్రకారాలుగా, శేషాచల శ్రీగిరిపై కొలువైన శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆ ప్రాంగణమంతా ఆవరించుకున్న అఖండ గోవింద నామార్చన సప్తస్వరాల్లా, ప్రణవనాదంలా మనసును స్వాంతనపరుస్తున్నాయి, అలిపిరి నుంచి పెద్దమెట్ల, శ్రీవారిమెట్ల మీదుగా కాలినడకన చేరుకున్నవాళ్లంతా స్వస్థత పొందిన శరీరాలతో మనసా, వాచా, కర్మణా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అక్కడే మరింతగా సేద తీరడం కోసమంటూ తీరుబడిగా కూర్చున్నారు భక్తజనబృందమంతా.కిందటిసారైతే తిరుమలలో స్వామివారి దర్శనానంతరం కళ్యాణీ ఆనకట్ట, పుష్కరిణీలు చూసుకొని ఆ తరువాత చుట్టుపక్కలున్న ప్రాంతాలు, దేవాలయాలు, నారాయణవనం, కార్వేటినగరం, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు, అప్పలాయగుంట, గుడిమల్లం, కోదండ రామాలయంతో పాటు కైలాసనాథకొండ దేవాలయాలు మొదలైనవి సందర్శించాం. తిరుమల కొండపై శ్రీవారిని దర్శించుకున్న అనంతరం అక్కడే వైకుంఠ ద్వారానికి ఎదురుగా వున్న ప్రాంతంలో చప్టా మీద ఆసీనులయ్యాం నలుగురమూనూ. మా వెనుక కూర్చున్న బృందం ఉపాధ్యాయులనుకుంటా.. మేమైతే వెనక్కు తిరగలేదు కానీ వాళ్ల మాటలనుబట్టి, అక్కడున్నవాళ్లల్లో నవ వధువు వుందనుకున్నాం. ఎందుకంటే వాళ్లు ఆమెను ఆటపట్టిస్తున్న తీరునుబట్టి నవవధువు వుండి వుండాలనుకున్నాం. “శ్రీవారిని దర్శించుకున్నారా?” ఎవరినుద్దేశించలా అడిగారో యిదమిద్దంగా తెలియకపోయినా చూచాయగా అర్థమవుతోంది పరిస్థితి. నేను మెల్లగా తల వెనక్కు తిప్పాను.

 “మేమనుకున్నది నిజమే, అందులో ఒకామె పసుపుపచ్చగా కొత్తందాలతో బంగారు చామంతిపువ్వులా మెరిసిపోతోంది” అన్నాను మెల్లగా దేవితో. నా భుజం మీద బలంగా గిచ్చుతూ పెదిమలు బిగించి, తర్జని చూపిస్తూ కళ్లతో ఏదో అంటోంది. చిరునవ్వుతో దేవి గిల్లినచోట చేత్తో రాసుకుంటూ పెదిమలతో బాధ భరిస్తున్నట్లుగా గాలి లోపలకు తీసుకున్నాను. దాంతోపాటే వచ్చే శబ్దం ద్వారా దేవికి తెలియజేసానన్నమాట. “ఐతే శ్రీవారిని ఏం కోరుకున్నారు” కుతూహలాన్ని గొంతులోనూ, శరీర భంగిమల్లోనూ ఒకే తీరుగా ప్రదర్శింపచేస్తూ. అక్కడున్న మిగతా బృంద సభ్యులంతా కూడబలుక్కున్నట్లుగానూ, అల్లరిగానూ, అకస్మాత్తుగా, అమాయకంగా ఏదో ఆలోచనలో ఉన్నట్లుగా “ఏ శ్రీవారిని?” కనుబొమలు పైకెత్తి కుతూహలంగా పరిసరాలను ఓరకంటితో ఆ ప్రశ్న వచ్చిన దిక్కుకేసి పరికించి చూస్తూ. “ఆ.. ఏ శ్రీవారేమిటీ?” ఆశ్చర్యంతో కూడిన ప్రకటనతోబాటుగా అక్కడున్న మిగతా మహిళామణులొక్కసారిగా ముసిముసిగా నవ్వుతున్నారు, విషయం అర్థమైందనిపించింది. ఆ నవ వధువుకూ అర్థమైందనుకుంటా ఆ శ్లేషలోని మెలి, సిగ్గుతో మెలికలు తిరిగిపోతోంది. మిగతా వాళ్లంతా ఒక్కసారిగా గలగలమంటూ గవ్వలపొదలా, కిలకిలమంటూ పక్షుల్లా కువకువలాడుతూ శీతాకోకచిలుకల్లా నయనానందకరంగా చూపులను నలువైపులా చంచలంగా ప్రసరింపచేస్తూ పరిసరాలకు మరిన్ని పరిమళాలను అయాచితంగా తమ తమ ఉనికిని చాటుతూ అద్దుతున్నారు. 

తలపులలోంచి వెలుపలికి వచ్చి సమయ సూచికను చూస్తే పావుతక్కువ తొమ్మిది. పల్చగా పెదిమలపై పూసిన ఆనాటి జ్ఞాపకం. ఏవేవో సంఘటనలనూ, సని వేశాలనూ సన్నిహితవేషాలను ఎందుకు మనసు తనలో నిక్షిప్తం చేసుకుంటుందో, ఏది అవసరమో, ఏది అనవసరమో అన్నది ఏమాత్రం పరికించకుండా తన దృష్టిలో పడిన ప్రతీదాన్ని ప్రక్షిప్తం గావించుకుంటుందో యిప్పటికీ ఏ శాస్త్రజ్ఞు లకు ముఖ్యంగా మానసిక శాస్త్రవేత్తలకు అంతుబట్టలేదు. దేవి ఎప్పుడు సమక్షంలోంచి వెళ్లిపోయిందో నేను గమనించలేనంతగా ఆలోచనలో మునిగిపోయానా, తేలిపోతున్నానా ప్రస్తుతానికది అప్రస్తుతమనిపించింది. బద్ధకంగా కూర్చునే తిమ్మిరెక్కిన చేతులు పైకెత్తి రెండు మూడు సార్లు ఝాడించాను. ఒక్కసారిగా కాళ్లు బాల్కనీ గోడకు బలంగా అన్చిపెడుతూ భుజాలు విశ్రాంతిగా ఒక విధమైన లయతో కదిలించాను. అప్పటికే పిల్లలిద్దరూ ఆకలితో కాలు కాలిన పిల్లుల్లా అక్కడక్కడే తిరుగుతున్నారు. “నాన్నా! అమ్మ భోజనానికి రమ్మంటోం దం”టూ ప్రశాంతి వచ్చింది చేతిలో వున్న అప్పడాన్ని నములుతూ. అప్పటికే భోజనాల బల్లదగ్గరకు చేరాడు ప్రశాంత్, తను కూడా అప్పడాన్ని నమలడంతో విశేషంగా తల మునకలైపోయున్నాడు. దేవి బల్లపై భోజనాల కవసరమైన పదార్థాలను సర్దడంలో నిమగ్నమై వుంది. అప్పుడప్పుడు ప్రశాంతి సైతం చేయందిస్తుంది అమ్మకు సాయంగా, అక్కడున్న పదార్థాలను చూశాను. బంగాళాదుంప వేపుడు, రసం, అప్పడాలు కావాలనుకుంటే కందిపొడీ, ఊరగాయా అక్కడే వున్నాయి. యింకేం కావాలి. పెరుగు సరేసరి. 

ఆ పెరుగన్నంలోకి సాయంత్రమే తెచ్చిన కర్పూర చక్రకేళీ అరటిపళ్లున్నాయి. భోజనాలు చేస్తూ “మనం తిరుపతెళ్లి రెండేళ్లయిందనుకుంటా” నన్నాను ఉపోద్ఘాతంగా. “అవును. యిప్పుడెందుకా ప్రస్తావన” అంటూ కళ్లెగరేసింది దేవి, పెదవులు సన్నగా నవ్వుతున్నాయి. “ఇదుగో నాన్నా, వచ్చే నెలలో పరీక్షలున్నాయంటూ పిల్లలద్దరూ ఒకేసారి కీచుమన్నారు”. “కంగారుపడకండి యిదొక అవగాహనా సరళి మాత్రమే. అందుకు కావల్సిన ప్రణాళికగా మనమొకమాటనుకుంటే యిదంతా పూర్తయ్యేసరికి రెండు నెలల సమయం సునాయాసంగా పట్టేస్తుంది. ముఖ్యంగా యీసారి మనం విమానంలో వెళ్లొచ్చేద్దాం” అన్నాను ఊరిస్తున్నట్లుగా ముగ్గుర్నీ చూస్తూ. అందుకు కావల్సిన సెలవులు నేను, మీ అమ్మా పెట్టుకోవడం.. ఈ లోపులో మీ పరీక్షలైపోవడం తదితరాలన్నీ అయ్యేసరికి ఆ సమయమే అవుతుందన్నాను. పైగా ఆ పెద్దాయన దయా, కరుణా, అనుమతీ తర్వాత కాలమూ మొదలైనవి కలిసిరావాలి కదా” అన్నాను. “ఇవాళ సుందర రామయ్యగారని మా స్నేహితురాలు స్రవంతి మామగారి మిత్రుడు, మీకూ తెలుసు, గుర్తుందా మన పెళ్లికి కూడా వచ్చారు”. “అమ్మా! స్రవంతంటే “అదే నీకిష్టమైన స్రవంతక్క”. “అయనీరోజు బ్యాంకుకు వచ్చారు. నిజానికివ్వాళ క్యాష్ డ్యూటీ రమ్యది, కానీ ఒక్కసారిగా తనూ, భార్గవీ, శ్రీరమణి ముగ్గురూ వేరు వేరు కారణాలతో సెలవు పెట్టేసారు. అందువల్ల మేనేజరు తప్పనిసరి పరిస్థితులలో ఆ క్యాష్ సీటు నన్ను చూడమనడంతో నాకు తప్పలేదు. అప్పటికి ఓ పదిరవై మంది కస్టమర్స్ అయ్యుంటారేమో, ఈయనగారు వరుసలో వస్తూనే “అమ్మా! బాగున్నావా అమ్మా, ఆద్యంతాలు అమ్మా అంటూ పలకరిస్తూ, సంబోధిస్తూ అత్యవసరం పడడంతో ఒక్క పది రూపాయలకు స్వంత చెక్కిస్తున్నానమ్మా, కొంచెం చూసిపెట్ట” మన్నారు. 

“పెదనాన్నా! పది రూపాయల కోసం చెక్కెందుకూ, ఏటీఎమ్లో తెచ్చుకోవచ్చు కదా” అన్నాను. “నువ్వు చెప్పేదీ, చెప్పిందీ నిజమే తల్లీ, కానీ, మన బ్యాంక్లో వున్నదీ, మా ఇంటిదగ్గరన్నదీ పని చెయ్యడం లేదు, యింకొంచెం దూరంలో మరొకటుంది కానీ నేను వెళ్లలేనిప్పుడు” అన్నారాయన తన అశక్తతను తెలియజేస్తూ మెల్లగా మాట్లాడు తూనే అవసరాన్ని కచ్చితంగా సూచిస్తూ. “అయినా పెదనాన్నా, చెక్ మొత్తమెంతున్నా యిక్కడా జరగాల్సినదంతా ఒక్కటే అవుతుంది. అందుకే వీలైతే మీరు కనీస మొత్తానికి చెక్కివ్వగలరా” అన్నాను. మరికొన్ని క్షణాలు గడిచిన అనంతరం “ఐతే తల్లీ, కనీసం ఎంత మొత్తానికి చెక్కివ్వమంటావంటూ ఆగారు. నాక్కొంచెం పనెక్కువగానే వుంది, యింకా వరుసలో చాలామంది అసహనంగా ఎదురుచూస్తున్నారు. అయినా ఓపిగ్గా కనీసంగా ఒక వంద రూపాయలైతే బాగుంటుంది పెదనాన్నా” అన్నాను. “అవునా తల్లీ, ఐతే ఆ మేరకు చూసివ్వమ్మా” చెక్కు మీద వంద రూపాయలంటూ రాసిచ్చారు. మరో ఐదు నిమిషాలలో ఆయన పని కానిచ్చి వంద రూపాయలకు సరిపడా చిన్న నోట్లను చేతికిచ్చాను. వెనువెంటనే ఆ పెద్దాయన నేనంతకుముందిచ్చిన నోట్లలోంచి ఒక పది రూపాయలను చొక్కాజేబులో పెట్టుకుని మిగతా తొంభై రూపాయలను దాంతో పాటుగా పొదుపుఖాతాలో నిక్షిప్తం చేయడం కోసమంటూ ఒక పసుపురంగు కాయితంలో వున్న వివరాలను నింపి నాకిచ్చారాయన. ఇప్పుడాశ్చర్యపోవడం నా వంతైంది. ఆ పెద్దాయన తెలివికి సంతోషపడాలో మరొకపక్క ఆయన వరుసలో వెనకున్న పదులమంది అనీజీ ధృక్కులకు మరింతగా బలి కావాలో తెలియలేదు. 

గొప్ప అసహనంగా అనిపించింది. అయినా ఆయన కోరిక మేరకు తొంభై రూపాయలను అందుకున్నట్లుగా రసీదుపై డేట్ స్టాంప్ వేసి సంతకం పెట్టిచ్చాను. ఇంకప్పట్నుంచీ అది తలచుకున్నప్పడల్లా తెలివి ఎవరి సొత్తూ కాదు కదా అనిపించడంతో పాటుగా వయసురీత్యా వృద్ధులేగానీ, మనకంటే చాలా విషయాలలో వాళ్లే చాలా తెలివిగా అవసరమైనంత వరకూ తగుమాత్రంగా ప్రవర్తిస్తారని పదే పదే అనిపించడమే గాకుండా, మా మేనేజరక్కూ, మిగతా సహోద్యోగులకూ తెలియచెప్పడంతో.. “ఆయన చాలా పాత కస్టమర్. పైగా ఎన్నో ఫిక్స్ ఖాతాలతో బాటుగా ఎంతో మొత్తాన్ని ఎప్పుడూ పొదుపుఖాతాలో నిల్వగా వుంచుతుంటారన్నారు” మా మేనేజర్. “అనుభవాల సారం పూర్తిగా వంటబట్టించుకున్న తీరుతో మెరుస్తున్న ఉనికిని ఎవ్వరైనాసరే గౌరవించాల్సిందేమరి. ఐనా ఆయన ఉద్యోగ నిర్వహణా సమయంలో యిలాంటివి ఎన్ని చూసుంటారో కదా, యిప్పుడంటే కేవలం శరీరానికి వృద్ధాప్యం వచ్చింది కానీ ఆయన నైపుణ్యానికి కాదనిపించింది” అన్నాను. భోజనాలనంతరం పిల్లలిద్దరూ తాము తిన్న కంచాలు తీసి సింక్ లో పడేసి, చెరో గ్లాసుడు నీళ్లు తాగేసి వాళ్ల గదుల్లోకి లాగిన్నైపోయారు. నేను కూడా చేయి కడుక్కుని లేస్తూంటే “అవునూ, ఆ పనైపో యిందేమిటీ, కాయితాలు వచ్చేశాయా” గొప్ప నమ్మకంతో బల్లమీదున్నవన్నీ తీసి ఎక్కడివక్కడ సర్దుతూ. 

అవునన్నట్లుగా తలూపుతూ “ఈరోజే వచ్చాయి, యిందాక కార్యాలయానికి వచ్చి యిచ్చాడు సందుర” మన్నాను. ఏవేవో పిచ్చాపాటీ మాట్లాడుకుంటూండడంతో సమయం తెలియలేదు. తెల్లారిన తొలిగంటలోనే నా కోసం క్యాబ్ వస్తుంది. దాంట్లోనే ప్రశాంత్ను కాలేజీ బస్ పికప్ పాయింట్ దగ్గరా ప్రశాంతిని కాలేజీలో, దేవిగారిని బ్యాంక్ దగ్గర దింపేసి అప్పుడు నేను కార్యాలయానికి వెళ్లాలి. అప్పుడు “పన్నెండు దాటింది” అన్నాను దేవికేసి చూస్తూ. “ఔను” అన్నట్లుగా తలూపుతూ నా గుండెల మీద తలాన్చి మెల్లగా చేయి చాచి నా చేతివేళ్లలో వేళ్లు కలిపి ఒకింత బిగించి పట్టుకుంది. “ఇప్పుడు దేవిగారు కోటి రూపాయలకు పైగా ఆస్తికి అధిపత”న్న అన్నాను, తల మీద అరచేయుంచి మెడ వెనుక జడకిందుగా నిమురుతూ. సాయంత్రం సుందరమొస్తూ తెచ్చిచ్చిన మేం కొన్ని ఇంటి కాయితాల గురించి మాట్లాడుతూ. “ఇంక మేమంతా తమ కనుసన్నలలో మాత్రమే వుండాల్సిందే” అన్నాను మెల్లిగా, తనకే వినిపించేలా. గారంగా కదిలి రెండు చేతులనూ నా మెడ చుట్టూ వేసి దాదాపుగా ‘వేళ్లాడుతున్న భంగిమలో నన్నల్లుకుపోయింది. తర్వాత తన కుడి చేయి నా గుండెల మీదుగా రెండు వేళ్లతోనూ ఒక వేలి తర్వాత మరో వేలితో మీటుతూ ఏదో హమ్ చేస్తూ టీపాయ్ మీదున్న జాజుల మాలను తీసి నా మొహం మీద కప్పేసింది. ఆ సుందర సౌరభాలకు ఉక్కిరిబిక్కిరైపోతూ తన వీపు వెనుకగా రెండు చేతులనూ బిగించాను. ఆ తర్వాత నా భుజాల మీదుగా పక్కకు జారిపడిన జాజులమాలను తన చేతికిచ్చాను. బుగ్గలపై పెదిమలానిస్తూ చెవితమ్మెల మీదుగా పెదమలతో బిగించాను. అలారం మోగుతోంది… తెల్లారిందన్నట్లుగా. “అంటే నాలుగు నలభై అయిదైందన్నమాట” అన్నాను.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870