ఒక ప్రముఖ గురువు ప్రవచనాలు బోధించ దానికి జ్ఞానాపురానికి వచ్చాడు. ఏ ఊరుకు వెళ్లినా గురువుకు ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. దాంతో ప్రవచనాలు బోధించడంలో తనను మించిన జ్ఞాని ఈ భూప్రపంచంలో లేడనే గర్వం గురువు మనసులో పెరిగిపోయింది. గర్వానికి దూరంగా ఉండే జ్ఞానా పురం ప్రజలు చాలా సౌమ్యలు.
ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ సయోధ్యగా ఉంటారు. ‘కోపం మనల్ని దహించివేస్తుంది’ అనే అంశంపై గురువు ఆరోజు ఉపన్యసించారు. ‘మిత్రులారా! మీరు కోపాన్ని దరి చేరనీయకండి. తన కోపమే తనకు శత్రువు అన్నారు పెద్దలు.
విపరీతమైన కోపం వస్తే ఏదిమంచి? ఏది చెడు అని తెలుసుకునే విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతాము. కోపాన్ని వదిలేస్తే జీవితం పూలవనం అవుతుంది’ అని గురువు అనర్గళంగా తన ప్రవచనాలలో చెప్పాడు.

ప్రవచనాలు ముగిసాయి. నిర్వాహకులు సత్కరించి లక్షరూపాయలు గురువుకు అందించారు. గురువుకు విపరీతమైన కోపం వచ్చింది. ‘ఇదేమిటి? నేను ప్రవచనాలు బోధించేందుకు మాట్లాడుకున్నది రెండు లక్షలు కదా? లక్షరూపాయలే ఇచ్చారు.
పైగా భోజనాలు సరిగాలేవు. నాకు పదిమందితో సత్కారం చేయించలేదు.’ అని నిర్వాహకులపై మండిపడ్డాడు. ‘అయ్యా! మాకు చందాలు ఇస్తామన్నవారు ఇవ్వలేదు. ఈసారికి ఇలా కానివ్వండి’ అని నిర్వాహకులు ప్రాధేయపడ్డారు. కోపంతో ఊగిపోతున్న గురువు తన చేతిలోని లక్షరూపాయలను అవతలకు విసిరేశాడు.
ఇంతలో అక్కడ పనిచేస్తున్న నిరక్షరాస్యుడైన సౌమయ్య మంచినీళ్లు తెచ్చి గురువుకు అందించాడు. నీళ్లు తాగిన గురువు కోసం తగ్గి కొంత కుదుటపడ్డాడు. ‘అయ్యా! తమరేమీ అనుకోనంటే నాదో ప్రశ్న’ అన్నాడు సోమయ్య. ‘అడుగు’ అన్నాడు గురువు.

అయ్యా! మీరు ప్రవచనాలలో భాగంగా చెప్పే నీతులు మాకే వర్తిస్తాయా? మీక్కూడా వర్తిస్తాయా?’ అని ప్రశ్నించాడు. ‘ఇదేం ప్రశ్న? నీతులు, మంచి మాటలు అందరికీ వర్తిస్తాయి. అందరూ వినాలి. పాటించాలి? అన్నాడు. గురువు.
‘మీరు దశాబ్దాల కాలం నుండి ప్రవచనాలు బోధిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. కోపాన్ని జయించాలని అనర్గళంగా మాట్లాడి ఒక గంట వ్యవధిలోపే మా నిర్వహణలో లోపాలను ఎత్తి చూపుతూ అందరిపై విపరీతంగా కోపగించుకుంటున్నారు.
ఇది మీకు న్యాయామా? నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీతో మాట్లాడాలనుకున్న పేదలను మీ సమీపానికి కూడా రానివ్వడం లేదు. అదే ధనవంతులైతే మీవద్దకు సునాయాసంగా వచ్చి మాట్లాడుతున్నారు. ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించిన ధనాన్ని మీరు కోపంతో విసిరి అవతల పారేశారు.

మీరు బోధించే ప్రవచనాలలోని నీతులను మీరు కూడా ఆచరిస్తే బాగుంటుందని మనవి’ అన్నాడు సోమయ్య. ఈ ప్రపంచంలో తానే మహాజ్ఞానినని భావించి గర్వపడే గురువు నిరక్షరాస్యుడైన సోమయ్య మాటలు విని అవాక్కయి తన తప్పును తెలుసుకుని సిగ్గుతో తలదించుకున్నాడు.
ఆరోజు నుండి గురువు గర్వాన్ని, కోపాన్ని వీడి తన ప్రవచనాలతో చెప్పే నీతులను సాధ్యమైనంతవరకు పాటించే ప్రయత్నం చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: