ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా అసెంబ్లీ భవనం నిర్మాణానికి రూ.617 కోట్లు, హైకోర్టు భవన నిర్మాణానికి రూ.786 కోట్లు కేటాయిస్తూ ముందడుగు వేసింది. ఈ నిర్మాణ పనులను టెండర్లలో తక్కువ ధరను కోట్ చేసిన ఎల్1 బిడ్డర్‌కు అప్పగించనుంది.
“స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్” అనే ప్రత్యేక వ్యవస్థ
పర్యావరణానికి అనుకూలంగా, వరదల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో “స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్” అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు, రాష్ట్రంలో పునరుత్పత్తి శక్తి అభివృద్ధికి కూడా ప్రాధాన్యతనిస్తూ వివిధ ప్రాంతాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. బలిమెల మరియు జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద 30 మెగావాట్ల సామర్థ్యంతో రెండు హైడల్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఒడిశా పవర్ కన్సార్టియమ్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

విశాఖపట్నం ఐటీ హిల్-3లో టీసీఎస్‌కు 21.66 ఎకరాల భూమి
ఐటీ రంగాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, విశాఖపట్నం ఐటీ హిల్-3లో టీసీఎస్‌కు 21.66 ఎకరాల భూమిని కేటాయించింది. అలాగే ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయిస్తూ కీలక ఆమోదం ఇచ్చింది. అయితే ఈ కేబినెట్ భేటీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవడం గమనార్హం. ఆయన కూర్చునే స్థానం ఖాళీగా ఉండటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. మొత్తంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే కీలక నిర్ణయాలతో ఈ కేబినెట్ సమావేశం ముగిసింది.