కేదార్‌నాథ్ ఆలయం మళ్లీ భక్తుల సమ్మేళనంతో కళకళలాడుతోంది. శుక్రవారం (మే 2) ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ తలుపులు తెరచడంతో, చార్‌ధామ్ యాత్రలో భాగంగా వేలాది మంది శైవ భక్తులు కేదార్‌నాథ్ దర్శనానికి తరలివచ్చారు. ఒక్క రోజులోనే భక్తుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. అధికారిక గణాంకాల ప్రకారం శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకూ 30,154 మంది భక్తులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఇందులో 19,196 మంది పురుషులు, 10,597 మంది మహిళలు, 361 మంది ఇతరులుగా అధికారులు వివరించారు.

శివధ్యానానికి శుభప్రారంభం
ఆలయ తలుపుల ప్రారంభోత్సవ సందర్భంగా భారత సైన్యంలో గౌరవప్రదమైన గర్హ్వాల్ రైఫిల్స్ బృందం సంగీత వాయిద్యాలతో భక్తుల మనసులను తాకింది. శివుని నామస్మరణతో ప్రాంగణం మార్మోగింది. ఈ పుణ్య ఘట్టానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హాజరై భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ముఖ్య సేవక్ భండారాలో ఆయనే స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్బంగా మే 4న బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకుంటాయని ఆయన ప్రకటించారు.
ప్రభుత్వ సన్నాహాలు & అభివృద్ధి పనులు
తీర్థయాత్రలో భద్రత, సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైందని సీఎం ధామి తెలిపారు. “దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులను స్వాగతించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. ప్రతి స్థాయిలో తీర్థయాత్రను నిరంతరం పర్యవేక్షిస్తుంది. తీర్థయాత్ర మార్గాల్లో వివిధ ప్రాథమిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం. చార్ ధామ్ యాత్ర రాష్ట్ర జీవనాడి కూడా. ఈ తీర్థయాత్ర లక్షలాది మందికి జీవనాధారం” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేదార్‌నాథ్ పునర్నిర్మాణ పనుల కోసం రూ.2000 కోట్లు కేటాయించామని, అలాగే గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్ వరకు రోప్‌వే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సీఎం ధామి ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే భక్తులకు ప్రయాణంలో మరింత సౌలభ్యం కలుగుతుంది.
కేదార్‌నాథ్ ఆలయ ప్రాముఖ్యత
హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువైన కేదార్‌నాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది చార్ ధామ్ యాత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చి పరమేశ్వరుడిని దర్శించుకుంటారు. అయితే శీతాకాలంలో, దాదాపు ఆరు నెలల పాటు ఈ ఆలయం తలుపులు మూసివేయబడతాయి. ఆ సమయంలో పర్వత ప్రాంతంలో తీవ్రమైన మంచు కురిసే పరిస్థితుల వల్ల యాత్ర నిలిపివేయబడుతుంది. వేసవి ప్రారంభంలో, మళ్లీ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి.
Read also: Kedarnath Dham: మొదలైన కేదార్‌నాథ్ యాత్ర, భారీ భద్రత మధ్య కొనసాగింపు