హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నారట. ఈ విషయాన్ని మీడియా చిట్ చాట్‌లో కేటీఆర్ ప్రకటించారు. ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారు. తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారని తెలిపారు కేటీఆర్. కేసీఆర్ స్థాయి వేరు, వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు, పనికిమాలిన మాటలు వినడానికి కేసీఆర్ రావొద్దు అనేది ఒక కొడుకుగా నా అభిప్రాయం అంటూ వ్యాఖ్యానించారు.

మంత్రి వర్గ విస్తరణ కూడా చేయలేదు
కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ పార్టీలో ఎవరూ సరిపోరన్నారు. వేం నరేందర్ రెడ్డికి పదవి ఇప్పించు కోలేక పోయాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీ లో వినట్లేదన్నారు. ఆయన అనుచరులకు పదవులు ఇప్పించు కోలేక పోతున్నారని చురకలు అంటించారు. ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థుల ను చూస్తే అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. సొంత అనుచరుడు వేం నరేందర్ రెడ్డి కి కూడా పదవి ఇప్పించు కోలేక పోయాడని సెటైర్లు పేల్చారు. 39 సార్లు ఢిల్లీ కి పోయినా మంత్రి వర్గ విస్తరణ కూడా చేయలేక పోతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ పార్టీ భేటీ
ఇక, బుధవారం అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ పార్టీ భేటీ కానుంది. అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలు.. సర్కార్‌పై సంధించాల్సిన ప్రశ్నలు..అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. అయితే.. డైరెక్షన్ మాత్రమే కాదు డైరెక్ట్‌గా సభకు వస్తారంటున్నారు బీఆర్‌ఎస్ నేతలు. టీచర్స్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ దూరంగా ఉండడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేసీఆర్ టోన్‌తో పొలిటికల్ సీన్ మారింది. బీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం సభలో ఉన్న బలం-బలగం ప్రకారం ఒక సీటు గెలవచ్చు.