కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈసారి రూ.4,08,647 కోట్ల మొత్తాన్ని కేటాయించారు. మౌలిక సదుపాయాలు, మతపరమైన కేటాయింపులు, సినిమా రంగ ప్రోత్సాహం, మహిళా సాధికారికత వంటి అంశాలకు పెద్ద పీట వేశారు.
కీలక నిర్ణయం
సినిమా రంగానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలను ప్రకటించింది. ముఖ్యంగా, మల్టీప్లెక్స్‌లతో సహా అన్ని థియేటర్లలో టికెట్ ధరలను ఒకే స్థాయిలో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. సినిమా టికెట్ ధరను రూ.200గా నిర్ణయించి, అన్ని షోలకు ఇదే ధర వర్తించనుందని సీఎం సిద్ధ రామయ్య వెల్లడించారు. సామాన్య ప్రజలకు సినిమా వీక్షణాన్ని మరింత అందుబాటులోకి తేవడమే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
ఫిల్మ్ సిటీ నిర్మాణం
మైసూరు నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించనుంది. ఈ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి రూ.500 కోట్ల నిధులను కేటాయించినట్లు ప్రకటించారు. సినీ రంగ అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.కన్నడ సినిమాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. దీనివల్ల కన్నడ సినీ పరిశ్రమకు మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.

ఈ బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలు సినిమా రంగానికి బలమైన మద్దతుగా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకంగా మైసూరు ఫిల్మ్ సిటీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్, టికెట్ ధర నియంత్రణ వంటి నిర్ణయాలు సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేయనున్నాయి.కర్ణాటక ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానం 2025-30 ను ప్రకటించింది. ఈ విధానం ద్వారా రూ. 7.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 20 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పారిశ్రామిక ప్రోత్సాహం మరియు ఉద్యోగ అవకాశాల పెంపును ప్రాధాన్యతనిస్తూ, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం కృషి చేయనుంది.పారిశ్రామికవేత్తల అనుమతులు, నియంత్రణలను సులభతరం చేయడానికి “కర్ణాటక ఎంప్లాయర్ కంప్లయన్స్ డీక్రిమినలైజేషన్ బిల్” మరియు “కర్ణాటక ఎంప్లాయర్ కంప్లయన్స్ డిజిటైజేషన్ బిల్” ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చట్టాల ద్వారా, కంపెనీలపై ఉన్న కొన్ని నేరపరమైన కేసులను తొలగించడంతో పాటు, నియామకాల సంబంధిత నిబంధనలను డిజిటల్ విధానంలో అమలు చేయనుంది. దీనివల్ల కర్ణాటక దేశంలో ఇలాంటి వ్యవస్థను అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలుస్తుంది.