కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ సమక్షంలో మేయర్ సునీల్ రావు కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సునీల్ రావు బీజేపీలో చేరడం బీఆర్ఎస్ పార్టీకే కాకుండా, కరీంనగర్ స్థానిక రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.
పార్టీలో చేరిన అనంతరం సునీల్ రావు బీఆర్ఎస్ నాయకుడు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గంగుల కమలాకర్ టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరి, ఆర్థికంగా ఎంతగా ఎదిగారో ప్రజలకు తెలుసుకోవాలన్నారు. టెండర్లలో అవకతవకలు, కమిషన్ల వ్యవహారాలు గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని ఆరోపించారు. కరీంనగర్ అభివృద్ధిలో ఆయన పాత్ర శూన్యమని అన్నారు.

డ్రైనేజీ, చెక్ డ్యాంలు, రోడ్ల కాంట్రాక్టుల్లో గంగుల కమలాకర్ బినామీల పాత్ర ఉందని, అందువల్లే పనులు నాణ్యత లేకుండా ఉంటాయని సునీల్ రావు విమర్శించారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పేరుతో నిధులు వృథా చేశారని ఆరోపించారు. తాను ఇన్నాళ్లూ కరీంనగర్ అభివృద్ధి ఆగిపోకుండా ఉండేందుకు మౌనంగా ఉన్నానని, ఇప్పుడు ప్రజల కోసం బీజేపీకి తన సేవలు అందించాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.
కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే పనులు జరిగాయని అన్నారు. బండి సంజయ్ కృషితోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమైందని ప్రశంసలు కురిపించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కాషాయ జెండాను ఎగురవేసే రోజు దగ్గరలోనే ఉందని ధీమా వ్యక్తం చేశారు.