Kangana Ranaut : కునాల్ కామ్రా వ్యాఖ్యలపై కంగనా ఫైర్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు.కేవలం రెండు నిమిషాల ఫేమ్ కోసం ప్రజలను అవమానించడం సమాజం ఎటువైపు పోతోందో చూపిస్తోందని ఆమె అన్నారు.“ఒకరిని అవమానిస్తూ అప్రతిష్టపాలు చేయడం సరైన పద్ధతి కాదు. మీరు ఎవరైనా కావచ్చు కానీ విమర్శ చేయాలంటే దానికి ఒక హద్దు ఉండాలి.సంస్కృతి ప్రజలను దూషించడం కామెడీ కాదు. విమర్శలు చేయాలనుకుంటే సాహిత్య ప్రక్రియ ద్వారా కూడా చేయొచ్చు.కానీ వ్యక్తిగత దూషణలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు” అంటూ కంగనా తీవ్ర స్థాయిలో స్పందించారు.

కంగనా స్వయంగా ఎదుర్కొన్న అనుభవాలు
ఈ వివాదంపై స్పందిస్తూనే, 2020లో తాను ఎదుర్కొన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు.”కునాల్ కామ్రా వివాదంలో స్టూడియోను కూల్చిన చర్య చట్టబద్ధంగా జరిగింది.కానీ 2020లో శివసేన ప్రభుత్వం నా బంగ్లాను అక్రమంగా కూల్చేసింది. ఆ సమయంలో నాపై రాజకీయ కక్ష సాధింపు జరిగింది” అని వ్యాఖ్యానించారు.ఆ సమయంలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నేపథ్యంలో కంగనా, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది.ఈ క్రమంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కంగనా కార్యాలయంలో కొన్ని నిర్మాణాలను కూల్చివేసింది.అయితే ముంబై హైకోర్టు ఈ చర్యను తప్పుబడుతూ, జరిగిన నష్టాన్ని పూడ్చాలని ఆదేశించింది.
కునాల్ కామ్రా వ్యాఖ్యలు – శివసేన ఆగ్రహం
కునాల్ కామ్రా ఇటీవల ముంబైలోని హబిటాట్ స్టూడియోలో ఓ ప్రదర్శనలో పాల్గొన్నాడు.ఈ ప్రదర్శనలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి “ద్రోహి” అంటూ తీవ్ర విమర్శలు చేశాడు.‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటను పారడీ చేసి, అమానకర రీతిలో షిండేను ఉద్దేశించి పాడాడు.ఈ వ్యాఖ్యలతో మండిపడ్డ శివసేన కార్యకర్తలు హబిటాట్ స్టూడియోపై దాడి చేశారు.స్టూడియోలో విధ్వంసం సృష్టించడంతో పాటు, అక్కడి ఆస్తులను ధ్వంసం చేశారు.దీంతో ముంబై పోలీసులు కునాల్ కామ్రాపై కేసు నమోదు చేశారు.కునాల్ కామ్రా వివాదంతో సంబంధం ఉన్న హబిటాట్ స్టూడియోపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు.స్టూడియోలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బీఎంసీ అధికారులు కూల్చివేశారు.ఈ చర్యపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, కంగనా మాత్రం దీనిని సమర్థించారు.
సమాజంలో విభజనకు ఇదే కారణం – కంగనా
ఈ వివాదంపై కంగనా మాట్లాడుతూ, “ఈరోజు సామాజిక మాధ్యమాల్లో కొన్ని వ్యక్తులు ఫేమ్ కోసం అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.ప్రజలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం తప్పే తప్ప.ఇది సమాజంలో విభజనకు కారణం అవుతుంది” అని అభిప్రాయపడ్డారు.ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలు, శివసేన కార్యకర్తల ప్రతిచర్యపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కంగనా చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.