KA Paul : ప్రవీణ్ కుమార్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలన్న కేఏ పాల్ రాజమండ్రి శివార్లలో జరిగిన భయానక ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ ఘటనను ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్న సమయంలో, ఆయన మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే, ఈ కేసుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పాస్టర్ ప్రవీణ్ మృతి నేపథ్యంలో క్రైస్తవ సంఘాలు సీరియస్‌గా స్పందిస్తున్నాయి.ఈ క్రమంలో ప్రముఖ క్రైస్తవ ధార్మిక నాయకుడు కేఏ పాల్ కూడా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.పోస్టుమార్టం ప్రక్రియను తాను ప్రత్యక్షంగా పరిశీలిస్తానని కోరినా, పోలీసులు అనుమతి నిరాకరించారు.పోస్టుమార్టం గదిలోకి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేయడంతో కేఏ పాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

సీబీఐ విచారణ జరపాలని కేఏ పాల్ డిమాండ్
ఈ ఘటనపై స్పందించిన కేఏ పాల్, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయి.ఇది సహజ మరణమా లేక ఏదైనా కుట్రా అన్నది స్పష్టంగా తెలియాలి.ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి అనితకు నేను మెసేజ్ లు పంపించినా, ఇప్పటి వరకు వారి నుంచి స్పందన రాలేదు” అని కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రవీణ్ మృతి వెనుక కుట్ర ఉందా?
ఈ ప్రమాదం సహజంగా జరిగిందా లేక ఎవరైనా దీని వెనుక ఉన్నారా అనే విషయంపై క్రైస్తవులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేఏ పాల్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాలు వెల్లడించాలని అధికారులను కోరారు. “ఆదరణ లేని ఆత్మీయ కుటుంబాలకు న్యాయం జరగాలి.పాస్టర్ ప్రవీణ్ మృతికి కారణాలన్నీ ప్రజలకు తెలియాలి.అవసరమైతే ఫోరెన్సిక్ నివేదికను కూడా ప్రజా దృష్టికి తేవాలి” అని ఆయన తెలిపారు.ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను బయటపెట్టాలని క్రైస్తవ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.ప్రమాదం అసలు ఎలా జరిగింది? ప్రవీణ్ కుమార్ మృతి ఎలా జరిగింది? అతని మృతికి మద్యం, డ్రైవింగ్ వేగం కారణమా లేక వేరే కారణాలున్నాయా? అన్నదానిపై క్లారిటీ రావాలని మతపెద్దలు డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ కేసు రాజమండ్రి పోలీసుల ఆధీనంలో ఉంది.పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు బయటపెడతారా? లేక ఈ కేసు మరింత ముదిరి సీబీఐ విచారణకు దారి తీస్తుందా? అన్నదానిపై అందరి దృష్టి నిలిచింది.