న్యూఢిల్లీ: ‘వక్ఫ్ సవరణ బిల్లు’కు ఆమోదం లభించింది. ఈ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఈరోజు సమావేశమైన పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది. అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సభ్యులు ప్రతిపాదించిన మొత్తం 14 సవరణలను జేపీసీ ఆమోదించింది. విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణకు గురయ్యాయి.
కాగా, వక్ఫ్ సవరణ బిల్లుకు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్‌కు బీజేపీ ఎంపీ జగదాంబి పాల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన సమక్షంలో జేపీసీ కమిటీ ఇవాళ సమావేశమైంది. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా.. 14 సవరణలను కమిటీ ఆమోదించినట్లు ప్యానెల్ ఛైర్మన్ జగదాంబిక పాల్ వెల్లడించారు. ఈ సవరణలు చట్టాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ 14 ప్రతిపాదనల ఆమోదానికి సంబంధించి జనవరి 29న ఓటింగ్ జరగనుంది. జనవరి 31న తుది నివేదిక లోక్‌సభకు అందజేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇక, ఈనెల 24న జరిగిన వక్ఫ్ ప్యానల్ సమావేశం రసాభాసగా సాగిన విషయం తెలిసిందే. జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్ ప్రొసీడింగ్స్ ద్వారా తమపై ఒత్తిడి తీసుకువస్తూ ఇష్టారీతిగా అజెండాను మార్చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలియజేయడంతో సమావేశానికి హాజరైన 10 మంది ప్రతిపక్ష సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. ప్రొసీడింగ్స్‌ని ఓ ప్రహసనంగా మార్చేసిన చైర్మన్ జగదంబికా పాల్ ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు జేపీసీ సమావేశంలో ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండించిన చైర్మన్ సమావేశాన్ని అడ్డుకోవడానికే సభ్యులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.