ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో యువత ఉద్యోగ అవకాశాల గురించి అవగాహన పెంపొందించుకునేలా ఈ మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
స్కిల్ సెన్సస్‌పై అసంతృప్తి
స్కిల్ సెన్సస్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, దీని ప్రగతిపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. యువతకు ఉన్నతమైన నైపుణ్యాలు అందించేందుకు, వారి ప్రతిభను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి అవకాశాలను పెంచేందుకు స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం కీలకమని పేర్కొన్నారు.

ప్రత్యేక నోడల్ ఏజెన్సీల ఏర్పాటు
రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల భాగస్వామ్యంతో యువతకు మరింత మెరుగైన శిక్షణ అందించేందుకు ప్రతి జోనుకు ఒక ప్రభుత్వ లేదా ప్రైవేట్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా గుర్తించాలని సూచించారు. ప్రస్తుత మార్కెట్ అవసరాలను తీర్చేందుకు, యువతకు అవసరమైన ప్రాధమిక నైపుణ్యాలను అందించేందుకు ఈ నోడల్ ఏజెన్సీలు ముఖ్యమైన పాత్ర పోషించనున్నాయి.
వర్క్ ఫ్రం హోమ్ అవకాశాల పెంపు
నేటి డిజిటల్ యుగంలో పని చేయడానికి వీలుగా వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ విధానంలో ఆసక్తి కనబరిచినవారిని రిజిస్టర్ చేసుకుని, వారికి తగిన శిక్షణ అందించాలని సీఎం సూచించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర యువతకు ఇంటి వద్దనే ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.