ఢిల్లీ నగరంలోని ఫర్ష్ బజార్ ఏరియాలో జూన్ 19న ఓ బంగారు దుకాణం (Jewellery Shop)లో కాస్త సినిమా స్టైల్లో చోరీ జరిగింది. పిస్టల్ మాదిరిగా కనిపించే టాయ్ గన్ చేతపట్టి ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. అక్కడి సిబ్బందిని బెదిరించి నాలుగు బంగారు బ్రాస్‌లెట్లు అపహరించి పరార్ అయ్యాడు.ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేరుకున్న వెంటనే వారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. కొన్ని గంటల వ్యవధిలోనే దొంగను గుర్తించారు. అతను మరెవరో కాదు, బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (Constable in BSF)గా పనిచేస్తున్న గౌరవ్ యాదవ్ అని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

పంజాబ్ నుండి మధ‍్యప్రదేశ్ వరకు – పోలీసుల చెరలో నిందితుడు
గౌరవ్ యాదవ్ ప్రస్తుతం పంజాబ్‌లోని ఫజిల్కాలో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతను స్వస్థలం అయిన మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా గ్రామంలో అతడిని అరెస్టు చేశారు. ఇంట్లో ఉన్న రెండు కంకణాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రెండు అమ్మిన తరువాత వచ్చిన రూ.2 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు గుర్తించారు.పోలీసుల విచారణలో గౌరవ్ జూదానికి బానిసైనట్లు వెల్లడైంది. భారీ మొత్తంలో డబ్బు కోల్పోయిన అతడు నేర సీరియల్స్ ద్వారా ప్రభావితమై దోపిడీకి దిగాడని వెల్లడించారు. 2023లో బీఎస్‌ఎఫ్‌లో చేరిన గౌరవ్, కేవలం నాలుగు నెలల క్రితమే ట్రైనింగ్ పూర్తిచేశాడని అధికారులు తెలిపారు.
ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ వరకూ తప్పించుకునే ప్రయాణం
గౌరవ్ యాదవ్ జూన్ 18న సెలవు తీసుకుని ఢిల్లీకి వచ్చాడు. టాయ్ గన్ కొనుగోలు చేసి జ్యువెలరీ షాప్‌లో దోపిడీ చేశాడు. ఆపై మీరట్, లక్నో మీదుగా రైళ్లు మారుతూ చివరకు తన స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు అతడి మీద ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు పేర్కొన్నారు.ఈ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రక్షణ దళంలో విధులు నిర్వహించే వ్యక్తి ఇలా నేరానికి పాల్పడటం బాధాకరం. టాయ్ గన్‌తో వచ్చినా, దాని ఫలితం మాత్రం నిజమైన నష్టమేనని పోలీసులు వ్యాఖ్యానించారు.
Read Also : Urea : బ్లాక్ మార్కెట్ యూరియాపై కఠిన చర్యలు తప్పవు : ఎస్‌ఐ మానస