ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా తొక్కిసలాట ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ, ప్రముఖ నటి జయా బచ్చన్ తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గత నెలలో జరిగిన ఈ తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదంలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారని, దాంతో కుంభమేళా ప్రాంగణంలో నీరు కలుషితమైందని జయా బచ్చన్ ఆరోపించారు. మతపరమైన భారీ కార్యక్రమానికి ప్రభుత్వం సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని ఆమె అన్నారు.

ఈ ఘటనపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ప్రతిపక్ష నేతలు కూడా పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశారు. అసలు మృతుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతోందని వారు ఆరోపిస్తూ, ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కుంభమేళాలో జరిగిన ఈ విషాద ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై సమగ్ర విచారణ జరిగి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భక్తుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు, నేతలు డిమాండ్ చేస్తున్నారు.