ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, గవర్నర్ ప్రసంగం, పాలనపై తన అభిప్రాయాలను ఆయన వెల్లడి చేసే అవకాశం ఉంది.

ఇప్పటికే జగన్ ప్రభుత్వం నుంచి విపక్షంగా మారిన తర్వాత, ఆయన పలు మార్గాల్లో కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. విజయవాడ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో కూడా ఆయన తీవ్రస్థాయిలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ముఖ్యంగా, రాష్ట్రంలో పాలన అస్థిరంగా మారిందని, ప్రజల సమస్యలు పెరిగిపోయాయని జగన్ ఆరోపించారు.
తన ప్రసంగంలో జగన్, “జగనన్న 2.0 వేరే లెవెల్లో ఉంటుంది” అంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. తన పార్టీ బలంగా పోరాడి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలు మళ్లీ వైసీపీ వైపే చూస్తున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ హామీలను తాము నిలబెట్టుకున్నామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుత ప్రభుత్వం తన పాలనపై సమీక్ష చేసుకోవాలని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితి, రైతుల సంక్షేమం, ఉద్యోగ నియామకాలు, సామాజిక అభివృద్ధి వంటి అంశాలపై ప్రెస్ మీట్‌లో జగన్ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
రేపటి మీడియా సమావేశం వైసీపీ కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభుత్వంపై జగన్ చేసే విమర్శలు, భవిష్యత్ కార్యాచరణపై ఆయన ఎలాంటి ప్రకటనలు చేస్తారో చూడాలి. రాష్ట్ర రాజకీయాలపై ఈ సమావేశం ప్రభావం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.