- తమ పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు
- అన్యాయంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టేది లేదు
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను విజయవాడ సబ్ జైలులో మంగళవారం ఉదయం కలిశారు. కిడ్నాప్ కేసు ఆరోపణలపై రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని పరామర్శించిన జగన్, అనంతరం మీడియా ముందు స్పందించారు. టీడీపీ ప్రభుత్వంలో తమ పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని, ఇది ఒక కుతంత్ర రాజకీయాల భాగమేనని ఆరోపించారు. టీడీపీ శాశ్వతంగా అధికారంలో ఉండదని స్పష్టం చేస్తూ, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
పిడుగురాళ్ల మున్సిపల్ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు. తిరుపతి, తుని ఎన్నికల్లో కూడా వైసీపీ నేతలపై దాడులు జరిగాయని, టీడీపీ ప్రభావం లేని చోట ఎన్నికలను వాయిదా వేయించడం సజావుగా మారిందని అన్నారు. పోలీసులు కూడా ప్రభుత్వ హస్తకంగా మారిపోయారని మండిపడ్డారు. అధికారులంతా ముఖ్యమంత్రి చెప్పినట్లే పనిచేస్తున్నారని, కానీ టోపీ మీద మూడు సింహాలనే నమ్మాలని సూచించారు. ఏపీలో ప్రజాస్వామ్యం హరించబడుతుండటాన్ని ఖండిస్తూ, రాబోయే రోజుల్లో ప్రజలు దీని గురించి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని జగన్ వ్యాఖ్యానించారు.
వైసీపీ అధికారంలోకి వస్తే, అన్యాయంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టేది లేదని జగన్ హెచ్చరించారు. చట్టాన్ని అపహాస్యం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రిటైర్ అయినా తప్పించుకోలేరని స్పష్టం చేశారు. తప్పు చేసినవారు ఎవరైనా సరే, వారిని ఎక్కడైనా ఉన్నా తెచ్చి చట్టం ముందు నిలబెడతామని ఆయన హామీ ఇచ్చారు. గన్నవరం ఘటనలో వల్లభనేని వంశీకి సంబంధం లేదని, టీడీపీ నేత పట్టాభి ప్రవర్తనే ఆ హింసకు కారణమని జగన్ పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపితంగా జరిగిన ఈ అరెస్టును ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజా తీర్పు స్పష్టమవుతుందని అన్నారు.