శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో జరిగిన దారుణ హత్య రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లింగమయ్య కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు.

దారుణ హత్య
సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురుబ లింగమయ్య ఇటీవలే దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లింగమయ్యను తెలుగుదేశం పార్టీ నాయకులు పథకం ప్రకారం హత్య చేశారంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగాది పండుగ రోజున లింగమయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో దారి కాచిన టీడీపీ నాయకులు, వారి అనుచరులు దాదాపు 20 మంది కలిసి అతనిపై దాడి చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర ఉత్కంఠ రేపింది.
కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించిన జగన్
తాజాగా, వైఎస్ జగన్ లింగమయ్య భార్య, కుమారులు శ్రీనివాసులు, మురళిలతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ హత్యకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకున్నారు. రాజకీయ కక్షలే ఈ ఘటనకు కారణమని కుటుంబ సభ్యులు జగన్‌కు వివరించారు. గ్రామంలో భద్రతా సమస్యలు, పోలీసుల వైఖరి గురించి కూడా చెప్పి తమకు రక్షణ లేదని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. లింగమయ్య కుటుంబానికి రక్షణ కల్పించేందుకు లీగల్ సెల్‌ను అప్రమత్తం చేస్తామని తెలిపారు. “మీరు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దు” అని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా ఆదుకుంటామన్న జగన్, వచ్చే వారం వ్యక్తిగతంగా స్వయంగా వస్తానని చెప్పారు. లింగమయ్య కుమారులు మాట్లాడుతూ స్థానిక ఎస్ఐ పూర్తిగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. మాకు భద్రత కూడా లేదు అని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం రేపుతోంది. పార్టీలోని ముఖ్య నాయకులు నిర్దోషులైన కార్యకర్తలపై దాడులు మేము ఊరుకోము అంటూ బహిరంగంగా హెచ్చరించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు లింగమయ్య హత్యను ఖండిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపడుతూ ప్రభుత్వం ఈ హత్యను వెనుకేసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.