అమరావతి: మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. కండవా కప్పి పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. శైలజానాథ్‌తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమన్నారు. ప్రజల తరుపున వైఎస్‌ఆర్‌సీపీ పోరాడుతుందన్నారు. వైఎస్ జగన్ రాజకీయ విధానాలు నచ్చటం వల్లే వైసీపీలోకి చేరానని తెలిపారు.

కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తోందని.. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చటం లేదని శైలజానాథ్ అన్నారు. ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. రాయలసీమలో ప్రజల కష్టాలు తీర్చేందుకు నా వంతు పనిచేస్తా.. రాజకీయాలు ప్రజా ప్రయోజనాల కోసం చేయాలే కానీ ఆర్ధిక ప్రయోజనాల కోసం కాదు. కాంగ్రెస్ నుంచి మరికొందరు నేతలు వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరు వస్తారనేది ఇప్పుడే చెప్పలేం. జగన్ ఏ బాధ్యత అప్పగించినా నా శక్తి మేరకు పనిచేస్తా అని శైలజానాథ్ చెప్పారు.
శైలజానాథ్ వైసీపీలో చేరిన సమయంలో ఆయనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. శైలజానాథ్ తో పాటు వచ్చిన వారిని జగన్ ఆప్యాయంగా పలకరించారు. కాగా, అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా శైలజానాథ్ గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేశారు. 2022లో ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.