ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో మరియు హైదరాబాద్ లోని ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సమాచారం ప్రకారం, ఆయన సోదరుడు, కుమార్తె, బంధువుల నివాసాలతో పాటు ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు అసలు పేరు వెలంకుచ వెంకట రమణారెడ్డి. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాతగా ప్రాచుర్యం పొందారు. ఆయనకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించింది.

జనవరి నెలలో దిల్ రాజు నిర్మించిన రెండు చిత్రాలు విడుదలయ్యాయి. పాన్-ఇండియన్ చిత్రం గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేకపోయినప్పటికీ, మరో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయాన్ని సాధించి, ఆర్ఆర్ఆర్ రికార్డులను సైతం బద్దలు కొట్టినట్లు సమాచారం. జనవరి 21 తెల్లవారుజామున జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఉజాస్ విల్లాస్ లో ఆయన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు ప్రారంభించింది.
వెలంకుచ వెంకట రమణ అలియాస్ దిల్ రాజు, రెండు తెలుగు రాష్ట్రాలలో బహుళ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. చలనచిత్ర నిర్మాణం మరియు డిస్ట్రిబ్యూటర్ వ్యాపారం ఉన్నప్పటికీ, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆయనకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన నేపథ్యంలో ఈ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.