టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థలపై రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. SVC నిర్మాణ సంస్థ యజమానులు దిల్ రాజు, శిరీష్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప-2, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ప్రకటించిన కలెక్షన్లకు కడుతున్న ఆదాయ పన్నుకు మధ్య తేడాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు- గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం నిర్మాత ఆయనే. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ రెండూ తెరకెక్కాయి. మూడు రోజుల వ్యవధిలో విడుదల అయ్యాయి. ఈ నెల 10న గేమ్ ఛేంజర్, 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదల అయ్యాయి.
ఈ రెండు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. గేమ్ ఛేంజర్ అంచనాలను అందుకోలేకపోయింది. డిజాస్టర్ అనే ముద్రను వేయించుకుంది. సంక్రాంతికి వస్తున్నాం మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టుకుంటోంది. ఈ సంక్రాంతి రేసులో హీరోగా నిలిచిందనేది ఫిల్మ్ నగర్ టాక్. ఈ రెండు సినిమాలు కూడా ఆ స్థాయిలోనే కలెక్షన్లు సాధించాయంటూ అధికారికంగా ప్రకటించుకోవడం వంటి పరిణామాలు ఈ ఐటీ దాడులకు కారణమైనట్లు చెబుతున్నారు. దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీల సందర్భంగా అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.