ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తులు, వర్కర్ల ఆకలి తీర్చేందుకు ఇస్కాన్ సంస్థ అదానీ గ్రూప్‌తో చేతులు కలిపింది. రోజువారీ లక్ష మందికి పైగా భక్తులకు ఆహారాన్ని అందించడం ద్వారా మహా సేవ కార్యక్రమానికి ఒడిగట్టింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో ఇస్కాన్ చేపట్టిన ఈ కార్యం ప్రత్యేకంగా నిలిచింది.
ఇస్కాన్ అందిస్తున్న ఆహారంలో దాల్, చోలే/రాజ్మా, వెజిటబుల్ కర్రీ, రోటీ, రైస్‌తో పాటు హల్వా లేదా బూందీ లడ్డూ వంటి స్వీట్లు కూడా ఉంటాయి. భక్తుల తాత్కాలిక అవసరాలను తీర్చే ఈ భోజనం పౌష్టికతను కూడా కలిగి ఉండటం విశేషం. పిడకలతో తయారుచేసిన మట్టి పొయ్యిపై ఈ భోజనం వండటమే ప్రత్యేకత.
ఇస్కాన్ ప్రతినిధుల ప్రకారం.. మొత్తం 100 వాహనాల ద్వారా మహాకుంభమేళాలోని 40 ప్రధాన ప్రాంతాల్లో ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. భక్తులు ఎక్కడ ఉన్నా, వారికి సమయానికి భోజనం అందించాలన్న సంకల్పంతో ఈ సేవలు నిర్వహిస్తున్నామని ప్రతినిధులు తెలిపారు. మహాకుంభమేళా వంటి భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇస్కాన్ చేసే సేవలు భక్తుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. ఒకవైపు భక్తులకు ఆధ్యాత్మిక అనుభవం కలగగా, మరోవైపు వారికి అవసరమైన ఆహారాన్ని అందించడం విశేషం. అదానీ గ్రూప్ సహకారంతో ఈ సేవలు మరింత విస్తరించాయి. మహాకుంభమేళాలో ఇస్కాన్ చేపట్టిన సేవా కార్యక్రమం భక్తుల మెప్పును పొందుతోంది. భక్తుల ఆకలిని తీరుస్తూ, వారి శారీరక శక్తిని పునరుద్ధరించడంలో ఈ ఆహారం కీలక పాత్ర పోషిస్తోంది.