హైదరాబాద్: ఇసుక, ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే పనులకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) నుంచే ఇసుక సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఖనిజాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక
నిర్మాణరంగ సంస్థలకు అవసరమైన ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేయాలి. సరైన ధరలకు సరఫరా చేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదు. హైదరాబాద్ నగరానికి మూడు వైపులా స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలి. క్వారీలకు జరిమానాలపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. మైనర్ ఖనిజాల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలి అని సీఎం ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.
ఇసుక అక్రమ రవాణకు అడ్డుకట్ట
ఇసుక బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణకు అడ్డుకట్ట వేసే బాధ్యత జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలకు హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రాకు అప్పగించారు. ఇసుక రీచ్‌ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్ తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రవాణకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు.