అమరావతి: వైసీపీ నేత విడదల రజనీ , ఐపీఎస్ అధికారి పల్లో జాషువాల విచారణకు ఏసీబీ పట్టుదలగా ఉంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారన్న ఆరోపణలతో వారిద్దరిపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఇందులో జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి తీసుకుంది. ఇప్పుడు విడదల రజనీ విచారణకు అనుమతించాలని ఏపీ గవర్నర్ కు లేఖ రాసింది ప్రభుత్వం. దీనికి ఒకటి, రెండు రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఏసీబీ విచారణకు ఆదేశం
శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ ఓనర్ లను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఫిర్యాదులపై ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వైసీపీ నేత విడదల రజనీ, ఐపీఎస్ జాషువాలు రూ.5కోట్లు డిమాండు చేసి రూ.2.20 కోట్లు వసూలు చేశారని అందులో రజినికి రూ.2 కోట్లు, జాషువాకు రూ.10 లక్షలు, రజిని పీఏకు రూ.10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది.
రజినితోపాటు ఆమె పీఏలపై కఠిన చర్యలు
మరోవైపు కొన్ని రోజుల క్రితమే వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టు లో ఊరట లభించింది. వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచరించిన హైకోర్టు.. విడదల రజినితోపాటు ఆమె పీఏలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ చిలకలూరిపేట పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టుల పెడుతున్నానంటూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే విడదల రజిని, ఆమె పీఏలతోపాటు పోలీసులు తనను వేధించారంటూ చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.