ఇటీవల మనదేశానికి కెనడా దేశానికీ మధ్య రాజకీయ వైరం కొనసాగుతున్నది. ప్రధాని ట్రూడో నిత్యం ఇండియాపై ఏదో ఒక విషయంలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీనితో కెనడా రాజకీయాలపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడోపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఆయన్ను ఎన్నికలకు ముందే తప్పుకోవాలన్న ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ట్రూడో నిన్న తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు లిబరల్ పార్టీ సిద్దమవుతోంది. ఈ రేసులో భారతీయ మూలాలున్న లాయర్, ప్రస్తుత కేబినెట్ మంత్రి అనితా ఆనంద్ ముందున్నారు.
రాజీనామాకు సిద్దమైన ప్రధాని
తొమ్మిదేళ్ల పదవీకాలం తర్వాత రాజీనామాకు సిద్దమైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో .. తాను పదవీవిరమణ చేస్తానని, అయితే లిబరల్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని తాజాగా ప్రకటించారు. దీంతో కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ప్రధానమంత్రి, పార్టీ నాయకుడిగా కొనసాగుతారు.

మార్చి 24 వరకు సస్పెండ్ చేసిన పార్లమెంట్ ఏదైనా విశ్వాస ఓట్లు లేదా ఎన్నికల పిలుపులు జరగడానికి ముందు తప్పనిసరిగా పునఃప్రారం భించాల్సి ఉంది. అలాగే తదుపరి ఎన్నికలు మే కంటే ముందుగా జరగవు. అక్టోబర్‌లో షెడ్యూల్ తేదీగా ఉంటుంది. దీంతో ట్రూడో నాయకత్వంలో ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండటానికి నాయకత్వ పోటీని వేగవంతం చేయడం లిబరల్ పార్టీ నేతల లక్ష్యంగా ఉంది. అలాగే ప్రధానిగా భారతీయ మూలాలున్న అనితా ఆనంద్ తో పాటు మెలానీ జోలీ, మార్క్ కార్నీ పోటీ పడుతున్నారు.
భారతీయ మూలాలున్న అనితా ఆనంద్
ఈ క్రమంలో భారతీయ మూలాలున్న అనితా ఆనంద్ పేరు తెరపైకి వస్తోంది. ఓక్‌విల్లే పార్లమెంటు సభ్యురాలు అయిన అనితా ఆనంద్ లిబరల్ పార్టీలో కీలక నేత. ప్రస్తుతం ఆమె రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రిగా కూడా ఉన్నారు. గతంలో రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు.