ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెండు విశిష్ట సహజ సంపదలు ప్రపంచస్థాయిలో అరుదైన గుర్తింపు సాధించాయి.తిరుమల కొండలు (Tirumala Hills), విశాఖపట్నం తీర ప్రాంతంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు (Red mud dunes) యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితా లో చోటు దక్కించుకోవడం రాష్ట్రానికి గర్వకారణం. భారతదేశం అంతటా ఏడు అద్భుతమైన సహజ, సుందర ప్రదేశాలు ఈ జాబితాలో కొత్తగా చేరగా, అందులో ఆంధ్రప్రదేశ్ నుండి ఈ రెండు స్థలాలు చోటు దక్కించుకోవడం ప్రత్యేకం.
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తాజా ప్రకటనలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు భారతదేశానికి చెందిన తాత్కాలిక ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంఖ్య 62 ఉండగా, ఈ కొత్తగా చేరిన ఏడు ప్రదేశాలతో ఆ సంఖ్య 69కి పెరిగింది. యునెస్కో తాత్కాలిక జాబితా (UNESCO Tentative List of World Heritage Sites) అనేది తుది ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు పొందేందుకు మొదటి అడుగు. అంటే, ఈ జాబితాలో చోటు దక్కిన ప్రదేశాలకు శాశ్వత గుర్తింపు, అంతర్జాతీయ రక్షణ, ప్రచారం, పర్యాటక అభివృద్ధి వంటి అనేక అవకాశాలు లభించే అవకాశముంటుంది.

సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల కొండలు, ఎర్రమట్టి దిబ్బలతో పాటు, మహారాష్ట్రలోని పంచగని, మహాబలేశ్వర్‌లలో ఉన్న దక్కన్ ట్రాప్స్, కర్ణాటకలోని సెయింట్ మేరీస్ ద్వీపం, మేఘాలయలోని గుహలు, నాగాలాండ్‌లోని నాగా హిల్ ఓఫియోలైట్, కేరళలోని వర్కల క్లిఫ్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.భారతదేశ అపురూపమైన సహజ, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి, ప్రోత్సహించడంలో మా నిబద్ధతకు ఈ గుర్తింపు నిదర్శనమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తిరుమల కొండల్లోని శిలాతోరణం, ఎపార్కియన్ అన్‌కన్‌ఫర్మిటీ వంటి అరుదైన భౌగోళిక నిర్మాణాలు సుమారు 150 కోట్ల సంవత్సరాల భూమి చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. ఈ చారిత్రక, భౌగోళిక ప్రాముఖ్యత కారణంగానే తిరుమల కొండలకు ఈ ప్రత్యేక గుర్తింపు లభించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: