Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలొనే ట్రంప్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఉన్న 10శాతమే అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే చైనాతో మాత్రం కయ్యానికి మరింత కాలుదువ్వారు. ఆ దేశంపై ఏకంగా 125 శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు.

ఉత్పత్తులపై 84 శాతం సుంకాలు
ప్రతీకారంగా చైనా.. అంతే దీటుగా స్పందించింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 84 శాతం సుంకాలను విధించింది. ఇటు కెనడా, ఐరోపా దేశాలూ తగ్గేదే లేదంటూ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డాయి. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 రోజుల నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నిర్ణయం వెలువడిన వెంటనే అమెరికా మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి.
మరో 50 శాతం సుంకాలు
మొదట చైనాపై 20 శాతం సుంకాలను ట్రంప్ విధించారు. ఆ తర్వాత దానికి అదనంగా 34 శాతం విధిస్తున్నట్లు ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. దీంతో అది 54శాతానికి చేరింది. దీనికి ప్రతీకారంగా అమెరికాపై 34 శాతం సుంకాలను చైనా ప్రకటించింది. దీంతో ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. చైనా వెనక్కి తగ్గకపోతే అదనంగా మరో 50 శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. అయినా చైనా పట్టించుకోలేదు. దీంతో బుధవారం నుంచి 50 శాతం కలిపి మొత్తం సుంకాలను ట్రంప్.. 104 శాతానికి చేర్చారు.
గురువారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది
దానినీ మళ్లీ బుధవారం సాయంత్రానికి 125శాతానికి పెంచారు. అమెరికా చర్యలను తీవ్రంగా పరిగణించిన చైనా.. 50 శాతం ప్రతీకార సుంకాలను బాదేసింది. గతంలో విధించిన 34 శాతంతో కలిపితే మొత్తం 84 శాతానికి చేరుకుంది. గురువారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆ దేశం ప్రకటించింది. దీంతోపాటు ప్రపంచ వాణిజ్య సంస్థలో అమెరికాపై కేసు వేస్తామని వెల్లడించింది. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు బుధవారం నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయని తొలుత ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.
చైనా మినహా మిగిలిన దేశాలపై సుంకాలకు 90 రోజుల మినహాయింపు
వీటిలో అత్యధికంగా చైనాపై 125%, భారత్‌పై 26% ఉన్నాయి. అయితే అనూహ్యంగా ట్రంప్ బుధవారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా మినహా మిగిలిన దేశాలపై సుంకాలకు 90 రోజుల మినహాయింపు ఇచ్చారు. ‘75 దేశాలు అమెరికా ప్రతినిధులను సంప్రదించాయి. వాణిజ్యం, వాణిజ్య అడ్డంకులు, సుంకాలు, కరెన్సీ విలువలను మార్చడం వంటి వాటిపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపాయి. అందుకే 90 రోజుల విరామం ప్రకటిస్తున్నా. అప్పటిదాకా 10శాతం సుంకాలు అమల్లో ఉంటాయి’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించారు. ఔషధాలపైనా త్వరలో సుంకాలను విధిస్తామని మంగళవారం రాత్రి ట్రంప్ ప్రకటించారు. దీనివల్ల ఔషధాలన్నీ అమెరికాలోనే తయారవుతాయని స్పష్టం చేశారు.
Read Also: అమెరికా సుంకాల పెంపునకు చైనా కౌంటర్