క్రెడిట్ కార్డ్ అప్పులతో సతమతమవుతున్న అమెరికన్లకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) అద్భుతమైన వార్త చెప్పారు. ఎన్నికల హామీని పునరుద్ఘాటిస్తూ.. క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై ఒక ఏడాది పాటు గరిష్టంగా 10 శాతం పరిమితి విధించాలని ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుతం అమెరికాలో క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు 20 నుంచి 30 శాతం వరకు ఉండటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. “అమెరికా ప్రజలను క్రెడిట్ కార్డ్ కంపెనీలు దోచుకోవడాన్ని మేము ఇక ఎంతమాత్రం అనుమతించం” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా స్పష్టం చేశారు.
మొత్తం క్రెడిట్ కార్డ్ అప్పు 1.23 ట్రిలియన్ డాలర్లు
ప్రస్తుతం అమెరికాలో సుమారు 19.5 కోట్ల మంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఉండగా.. వారు ఏడాదికి 160 బిలియన్ డాలర్ల వడ్డీని చెల్లిస్తున్నారు. మొత్తం క్రెడిట్ కార్డ్ అప్పు 1.23 ట్రిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరుకుంది. ట్రంప్ ప్రతిపాదించిన ఈ 10 శాతం పరిమితి గనుక అమలులోకి వస్తే.. సామాన్య ప్రజలకు ఏడాదికి దాదాపు 100 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 8.3 లక్షల కోట్లు) వడ్డీ భారం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది అమలైతే ఒక దశాబ్దం క్రితం ఉన్న వడ్డీ రేట్లు మళ్లీ వచ్చే అవకాశం ఉంది.
Read Also: Hyderabad: సంక్రాంతి పండుగ వేళ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ

బెంబేలెత్తుతున్న బ్యాంకింగ్ దిగ్గజాలు
ట్రంప్ తాజా నిర్ణయంపై బ్యాంకింగ్ రంగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వడ్డీ రేట్లను తగ్గిస్తే నష్టాలు వస్తాయని.. ఫలితంగా పేదలకు క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నవారికి అప్పులు ఇవ్వడం నిలిపి వేయాల్సి వస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయి. దీనివల్ల సామాన్యులు అధిక వడ్డీలకు ఇచ్చే ప్రైవేట్ ఫైనాన్షియర్లు లేదా తాకట్టు దుకాణాల వైపు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఇస్తున్న రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్లకు కూడా కోత పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ట్రంప్ ప్రతిపాదనకు అటు డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్ల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ వంటి వామపక్ష నేతలు, అలాగే ట్రంప్ సన్నిహితురాలు అన్నా పౌలినా లూనా వంటి వారు కూడా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్ల తగ్గింపు కోసం బిల్లులు సిద్ధం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: