సాధారణంగా కంపెనీలు లాభాల్లో ఉన్నప్పుడు చిన్నపాటి బోనస్‌లు ఇవ్వడం చూస్తుంటాం, కానీ అమెరికాలోని లూసియానాకు చెందిన ‘ఫైబర్‌బాండ్’ (Fiberbond) కంపెనీ సీఈఓ గ్రాహమ్ వాకర్ తన ఉద్యోగుల పట్ల చూపిన కృతజ్ఞతా భావం అసాధారణమైనది. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్‌ల కోసం ప్రత్యేకమైన ఎన్‌క్లోజర్‌లను తయారు చేసే తన కంపెనీని, ఈ ఏడాది ప్రారంభంలో ‘ఈటన్ కార్పొరేషన్’కు రూ. 15,265 కోట్లకు విక్రయించారు. అయితే, ఈ అమ్మకం ద్వారా వచ్చిన భారీ సొమ్ములో మెజారిటీ భాగాన్ని తన వద్ద పనిచేస్తున్న 540 మంది ఉద్యోగులకు పంచాలని ఆయన నిర్ణయించుకోవడం విశేషం. మొత్తం రూ. 2,155 కోట్లను బోనస్ రూపంలో పంపిణీ చేసి, కార్పొరేట్ ప్రపంచంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు.
Madras HC: చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన
గ్రాహమ్ వాకర్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒక బలమైన మానవీయ కోణం ఉంది. కంపెనీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు తమను నమ్మి వెన్నంటి ఉన్న ఉద్యోగుల కష్టానికి ఆయన ఇచ్చే గౌరవంగా ఈ బోనస్‌ను అభివర్ణించారు. కంపెనీ అమ్మకపు విలువలో సుమారు 15 శాతం మొత్తాన్ని ఉద్యోగులకే కేటాయించాలని ఆయన ముందే నిర్ణయించుకున్నారు. కేవలం నిర్ణయం తీసుకోవడమే కాకుండా, కొత్త యాజమాన్యం (ఈటన్ కార్పొరేషన్) ఈ బోనస్ చెల్లింపులకు అంగీకరించిన తర్వాతే కంపెనీ విక్రయ ఒప్పందంపై సంతకం చేయడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. తన విజయానికి కారకులైన కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని ఆయన చాటిచెప్పారు.

ఈ భారీ బోనస్ పంపిణీ వల్ల ప్రతి ఉద్యోగికి సగటున సుమారు రూ. 4 కోట్లకు పైగా నగదు లభించనుంది. కంపెనీలో వారి సీనియారిటీ మరియు హోదాల ఆధారంగా ఈ పంపిణీ జరిగింది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తం చేతికందడంతో ఉద్యోగుల ఆనందానికి అవధులు లేవు. కేవలం లాభాల వేటలో పడి మానవ సంబంధాలను మరచిపోతున్న నేటి కార్పొరేట్ యుగంలో, “ఉద్యోగులే కంపెనీకి నిజమైన ఆస్తులు” అని గ్రాహమ్ వాకర్ నిరూపించారు. కంపెనీ యాజమాన్యం మారినప్పటికీ, పాత ఉద్యోగులందరికీ ఆర్థిక స్థిరత్వం లభించేలా ఆయన చేసిన ఈ పని ఇతర పారిశ్రామికవేత్తలకు ఒక గొప్ప పాఠంగా నిలుస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com