తమిళనాడు (Tamila nadu)గవర్నర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం వివాదంలో కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా బిల్లుల విషయంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికి సర్వోన్నత న్యాయస్థానం గడువు విధించింది. దీంతో తాజాగా ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు(Supreme court) కు 14 ప్రశ్నలు సంధించారు. గడువు ఎలా విధిస్తారని ప్రశ్నించగా, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో స్పందించారు.2023లో సుప్రీంకోర్టు(Supreme court) ఒక కీలక తీర్పులో, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి సమయ పరిమితిని సూచించింది. తీర్పు ప్రకారం, గవర్నర్లు బిల్లులను ఆమోదించాలా లేదా తిరస్కరించాలా అనే అంశంపై నిర్దిష్ట కాల వ్యవధిలో స్పందించాల్సిందే.

బీజేపీ ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నారా?
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశ్నలపై స్టాలిన్ విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు (Supreme court) ఇప్పటికే వెలువరించిన తీర్పును తారుమారు చేసేలా ఉన్న రాష్ట్రపతి ప్రశ్నలకు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి భారతీయ జనతా పార్టీ ఆదేశానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ చెప్పినట్లు వ్యవహరించారనే వాస్తవాన్ని ఈ ప్రయత్నం స్పష్టంగా వెల్లడిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు (Supreme court) తీర్పును ముర్ము ప్రశ్నించడం ప్రజాస్వామ్యపరంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నమని స్టాలిన్ ఆరోపించారు. సుప్రీంకోర్టు అధికారాన్ని ఇది సవాలు చేస్తుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేసే గవర్నర్ల నియంత్రణలో ఉంచడం ద్వారా బలహీనపరిచే తీవ్ర ప్రయత్నం తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభ ఆమెదించిన బిల్లులపై గవర్నర్లు చర్య తీసుకోవడానికి సమయ పరిమితులను నిర్ణయించడంపై లేవనెత్తిన అభ్యంతరాలను స్టాలిన్ ప్రశ్నించారు. “గవర్నర్లు వ్యవహరించడానికి సమయ పరిమితులను నిర్ణయించడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి? బిల్లు ఆమోదంలో నిరవధిక జాప్యాలను అనుమతించడం ద్వారా బీజీపీ తన గవర్నర్ల అడ్డంకిని చట్టబద్ధం చేయాలని చూస్తుందా? కేంద్ర ప్రభుత్వం బీజేపీయేతర రాష్ట్ర శాసనసభలను స్తంభింపజేయాలని అనుకుంటుందా?” అంటూ క్వశ్చన్ చేశారు.
“ఇది చట్టపరమైన పోరాటం” – బీజేపీయేతర రాష్ట్రాలకు పిలుపు
బీజేపీయేతర రాష్ట్ర, పార్టీ నాయకులు చట్టపరమైన పోరాటంలో పాల్గొనాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. “మన దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రాష్ట్ర శాసనసభలను నిర్వీర్యం చేయాలనే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ దుష్ట ఉద్దేశాన్ని ముర్ము ప్రశ్నలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల ఇది రాష్ట్ర స్వయంప్రతిపత్తికి ముప్పును కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రక్షించడానికి చట్టపరమైన పోరాటంలో చేరాలని అన్ని బీజేపీయేతర రాష్ట్రాలు, పార్టీ నాయకులను కోరుతున్నాను. మన శక్తి మేరకు పోరాడుదాం. తమిళనాడు పోరాడుతుంది. తమిళనాడు గెలుస్తుంది!” అంటూ పోస్ట్ చేశారు స్టాలిన్.