మాల్దీవ్స్‌కు గతంలో చాలా మంది భారత పర్యాటకులు అక్కడకు వెళ్తూ ఎంజాయ్ చేసే వాళ్లు. కానీ క్రమేణా ఈ సంఖ్య తగ్గుతూ వస్తుండగా.. ఆ విషయాన్ని గుర్తించిన ద్వీప దేశం సర్కారు ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా భారతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుని.. 2025లో ఏకంగా 3 లక్షల మంది పర్యాటకులను తమ దేశంలోకి తీసుకు వెళ్లాలని ప్రయత్నిస్తోంది.మాల్దీవ్స్ మరియు భారత్‌ల మధ్య గతేడాది దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే ద్వీప దేశానికి పర్యాటక రంగంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా మాల్దీవ్స్‌కు వెళ్లే పర్యాటకుల్లో 2023లో ఇండియా అగ్రస్థానంలో ఉండగా.. 2024 నాటికి ఆరో స్థానానికి చేరుకుంది. ఆ విషయాన్ని గుర్తించిన అక్కడి సర్కారు 2025లో 3 లక్షల మంది భారతీయ పర్యాటకులను రప్పించుకునేందుకు చర్యలు చేపట్టింది. ఈక్రమంలోనే ఇండియాలో నెలవారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2023లో ద్వీపదేశానికి 18,78,543 మంది సందర్శకులు వచ్చారు. ఇందులో భారతీయుల సంఖ్య 2.09,193. అయితే గతేడాది అంటే 2024లో 20,64,615 మంది అక్కడకు వెళ్లారు. ఇందులో భారతీయుల సంఖ్య 1.30,805కి పడిపోయింది. అయితే 2024లో అత్యధిక పర్యాటకులు చైనా నుంచి వెళ్లగా.. రష్యా రెండో స్థానంలో నిలిచింది. 2023లో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. 2024లో ఆరో స్థానానికి పడిపోయింది. ముఖ్యంగా 2024 జనవరి నుంచి అక్టోబర్ వరకు ద్వీప దేశానికి భారత పర్యాటకుల సందర్శన బాగా తగ్గిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ సంఖ్య పెరిగినప్పటికీ పెద్దగా ఉపయోగం లేదు.