పాకిస్థాన్‌లో ఉగ్రవాదం పెరగడానికి ప్రధాన కారణంగా పేదరికాన్ని చెబుతూ వచ్చింది అంతర్జాతీయ సమాజం. పేదరికం, నిరుద్యోగం, విద్యా లోపం వంటివి ఉగ్రవాద గూటికి దారి తీసే అంశాలుగా భావిస్తూ, పాకిస్థాన్(Pakistan) ను ఆర్థికంగా మద్దతు ఇచ్చేందుకు అనేక దేశాలు ముందుకొచ్చాయి. బిలియన్ల డాలర్ల సహాయం, అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా రంగం లో అభివృద్ధికి సంస్కరణలు – ఇవన్నీ కూడా ఉగ్రవాదాన్ని నియంత్రించగలమనే ఆశతోనే చోటుచేసుకున్న చర్యలుగా చెప్పవచ్చు. ఇటీవల పహల్గామ్ ఘటన, భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వంటి పరిణామాల నేపథ్యంలో సరిహద్దు ఉగ్రవాదంపై చర్చ మళ్లీ రాజుకుంది. ఉగ్రవాదానికి అసలు మూలాలు సంక్షోభంలో కాకుండా, సౌకర్యవంతమైన జీవితాలు గడిపే వర్గాల్లోనే ఉన్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

2012 అధ్యయనం: కొత్త కోణానికి తెర
2012లో ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనం ప్రకారం పాకిస్థాన్‌లోని పట్టణ మధ్యతరగతి వర్గాలే ఉగ్రవాద సంస్థలకు అండగా నిలుస్తున్నాయని తేలింది. ఈ వర్గాలు సాధారణంగా హింసకు దూరంగా, సురక్షితమైన వాతావరణంలో జీవిస్తూ, ఉగ్రవాద భావజాలం పట్ల సిద్ధాంతపరమైన నిబద్ధత కలిగి ఉంటాయని అధ్యయనం పేర్కొంది. ఉగ్రవాదానికి పేదరికమే కారణమనే ప్రచారంలో ఉన్న వాదనకు ఈ పరిశోధన పూర్తి భిన్నమైన కోణాన్ని ఆవిష్కరించింది.
పట్టణ మధ్యతరగతి – అంతర్జాతీయ దృష్టిలో మార్పు అవసరం
గత కొన్నేళ్లుగా, పాకిస్థాన్‌లో ఉగ్రవాదం ప్రబలడానికి ఆర్థిక వెనుకబాటుతనమే కీలకమనే భావన అంతర్జాతీయ విధాన రూపకర్తల్లో బలంగా నాటుకుపోయింది. ఈ ఆలోచనా ధోరణి, అంతర్జాతీయ సహాయ కార్యక్రమాల దిశను కూడా నిర్దేశించింది. అయితే, పహల్గామ్, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) వంటి ఘటనలు సరిహద్దు ఉగ్రవాదంపై తీవ్రమైన చర్చకు దారితీయడంతో, ఉగ్రవాదానికి నిజమైన చోదకశక్తులు ఎక్కడ ఉన్నాయనే ప్రశ్నకు సమాధానం కోసం ఈ పాత అధ్యయనం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ అధ్యయనం ప్రకారం, ఆటుపోట్లకు దూరంగా, స్థిరమైన జీవితం గడిపే పట్టణ మధ్యతరగతి వర్గాలే ఉగ్రవాద గ్రూపులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాయని తెలుస్తోంది. ఈ పరిణామం, ఉగ్రవాద నిర్మూలనకు అనుసరించాల్సిన వ్యూహాలపై పునరాలోచన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.
Read also: Pope Leo: ఉక్రెయిన్ కాల్పుల విరమణ దిశగా అంతర్జాతీయ దౌత్యం