దశాబ్దాల తర్వాత పాకిస్తాన్‌లో(Pakistan Division) మళ్లీ విభజన అంశం తెరపైకి వచ్చింది. పాలన మరింత సులభంగా సాగించడమే లక్ష్యంగా దేశాన్ని 12 చిన్న ప్రావిన్సులుగా విభజించాలనే ఆలోచనను పాక్ పాలకులు ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న నాలుగు ప్రావిన్సులను ఒక్కోటి మూడు భాగాలుగా విడగొట్టి, మొత్తం 12 ప్రావిన్సులు ఏర్పాటు చేయాలనే ప్రణాళికపై చర్చలు జరుగుతున్నాయి.
Read Also: Trump Tariffs:భారత్ టారిఫ్‌లపై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత

పాలనా సౌలభ్యం పేరుతో కొత్త ప్రణాళిక
పాక్ జాతీయ సమాచార శాఖ మంత్రి అబ్దుల్ అలీమ్ ఖాన్ ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. పాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఈ విభజన లక్ష్యమని ఆయన పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సులను ఒక్కోటి నుంచి మూడు భాగాలుగా విభజించాలన్న ప్రతిపాదన సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి.
ప్రధాని–ఆర్మీ చీఫ్ మధ్య కీలక చర్చలు
ఈ అంశంపై పాక్(Pakistan Division) ప్రధాని షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif), ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మధ్య ఇప్పటికే కీలక సమావేశాలు జరిగాయని సమాచారం. విభజన ప్రక్రియకు సంబంధించిన చర్చలు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారికంగా ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముందని పాక్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
1971 విభజన జ్ఞాపకాలు మళ్లీ తెరపైకి
పాకిస్తాన్ విభజన అనగానే ప్రజలకు వెంటనే 1971 సంఘటనలు గుర్తొస్తున్నాయి. ఆ సమయంలో తూర్పు బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్‌గా అవతరించింది. ఆ తర్వాత పాకిస్తాన్ నాలుగు ప్రావిన్సులతో కొనసాగుతోంది. తాజాగా మళ్లీ విభజన అంశం తెరపైకి రావడం చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది.
1947 స్వాతంత్య్ర సమయంలో పాకిస్తాన్‌లో బలూచిస్తాన్, తూర్పు బెంగాల్, సింధ్, పశ్చిమ పంజాబ్, వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ అనే ఐదు ప్రాంతాలు ఉన్నాయి. 1971 తర్వాత తూర్పు బెంగాల్ బంగ్లాదేశ్‌గా మారింది. పశ్చిమ పంజాబ్ పేరు పంజాబ్‌గా, వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ పేరు ఖైబర్ పఖ్తుంఖ్వాగా మారింది. బలూచిస్తాన్, సింధ్ పేర్లు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి.
ఉద్రిక్తతల నడుమ విభజన ప్రతిపాదన
ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసమే విభజన చేస్తున్నామని చెబుతున్నా.. దేశంలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో స్వతంత్ర డిమాండ్లు పెరుగుతున్నాయి. అదే సమయంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఎక్కువవుతోంది. ఈ నేపథ్యమే విభజన ఆలోచనకు దారి తీసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రణాళికపై దేశవ్యాప్తంగా సెమినార్లు, బహిరంగ చర్చలు కొనసాగుతున్నాయి. అయితే విపక్ష పార్టీలు మాత్రం ఈ విభజన ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది పాలనా సౌలభ్యం కోసం కాదని, రాజకీయ ప్రయోజనాల కోసమేనని వారు ఆరోపిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :