భారత్‌లోని పాక్ పౌరుల బహిష్కరణ.. సీమా హైదర్ భవితవ్యంపై అనేక సందేహాలు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులను 48 గంటల్లో దేశం విడిచిపెట్టి వెళ్ళాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాఘా సరిహద్దుల గుండా పాక్ పౌరులు తమ స్వదేశానికి తిరిగి వెళ్తున్నారు. ఈ పరిణామాల్లో, గత ఏడాది నుండి వార్తల్లో నిలిచిన సీమా హైదర్ వ్యవహారం మరోసారి ప్రజాధృష్టికి వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన ఆమె పిల్లలతో కలసి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి, యూపీకి చెందిన యువకుడు సచిన్ మీనాను వివాహం చేసుకుంది. ఈ పరిణామం నేపథ్యంలో ఇప్పుడు ఆమె భవితవ్యంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
“సీమా భారత పౌరురాలు అయిపోయింది” – లాయర్ ఏపీ సింగ్
ఈ విషయంపై సీమా హైదర్ తరపున న్యాయవాది ఏపీ సింగ్ స్పందించారు. ఆయన ప్రకారం, సీమా ఇప్పుడు పాక్ పౌరురాలు కాదని, భారత యువకుడిని వివాహం చేసుకుని, ఇక్కడే ఓ కుమార్తెకు జన్మనిచ్చిందని తెలిపారు. వివాహం జరిగిన తర్వాత భర్త జాతీయత భార్యకు వర్తిస్తుందన్న నిబంధన ప్రకారం, సాంకేతికంగా సీమా భారత పౌరురాలని ఆయన వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు భారత్‌లో ఉన్న పాక్ పౌరులందరికి వర్తించకపోవచ్చు. ఒకవేళ వారు భారత పౌరులుగా మారినట్లయితే, వారికి మినహాయింపులున్నాయంటున్నారు.
న్యాయపరంగా మినహాయింపు అవకాశం
సీమా హైదర్ కేసు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తులో ఉన్నప్పటికీ, ఆమె ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉంటోంది. న్యాయస్థానం విధించిన షరతులను ఆమె పూర్తిగా పాటిస్తోందని ఏపీ సింగ్ తెలిపారు. గ్రేటర్ నోయిడాలోని రబూపురాలోని తన అత్తమామల ఇంటిని విడిచి వెళ్లకూడదన్న నిబంధనను గౌరవిస్తూ జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, ఆమె తరపున భారత రాష్ట్రపతికి కూడా అభ్యర్థన పంపినట్లు తెలిపారు. గార్డియన్‌షిప్ యాక్ట్ ప్రకారం తల్లే బిడ్డకు ప్రధాన సంరక్షకురాలని పేర్కొన్నారు. భారత్‌లో పుట్టిన కుమార్తెను పాకిస్థాన్‌కు పంపడం శాస్త్రీయంగా, నైతికంగా సరైనదికాదని ఆయన వాదిస్తున్నారు.
అక్రమంగా వచ్చినా.. అనుబంధాలు బలంగా మారాయి
సీమా హైదర్ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినా, ఆమె జీవితం పూర్తిగా ఇక్కడే స్థిరపడింది. నలుగురు పిల్లలతో కలిసి ఆమె సచిన్ మీనాతో జీవిస్తోంది. ప్రేమ, పెళ్లి, పిల్లల అనుబంధం వంటి అంశాలు ఆమెను భారత జీవన శైలికి చేర్చాయి. ఆమె జీవితం ఇప్పుడు పూర్తిగా భారతదేశానికి పరిమితమైపోయింది. ఈ నేపథ్యంలో ఆమెను పాకిస్థాన్‌కు పంపించడమంటే కేవలం ఒక వ్యక్తిని కాకుండా, ఆమె పిల్లల భవితవ్యాన్నీ దెబ్బతీసే చర్య అవుతుందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ చట్టాలను దృష్టిలో ఉంచుకుని సీమాకు మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.
READ ALSO: Pehalgam : పెహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ భారత్‌పై ఆంక్షలు