నైజీరియా(Nigeria)లో తాజాగా కురిసిన భారీ వర్షాల(Massive Floods)తో మోక్వా సిటీ తీవ్రంగా ప్రభావితమైంది. నిగర్ నది ఉప్పొంగడంతో వరదలు పట్టణాన్ని ముంచెత్తాయి. ఈ వరదల కారణంగా 3వేలకు పైగా ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో వేలాది మంది ప్రజలు తమ నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది. ప్రభుత్వం ఎమర్జెన్సీ సహాయ బృందాలను రంగంలోకి దించి సహాయక చర్యలు ముమ్మరం చేసింది.
మరణాల సంఖ్య 115 దాటింది – ఇంకా పెరిగే అవకాశాలు
వరదల్లో అనేక మంది కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 115 మృతదేహాలను వెలికితీశామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. సహాయ బృందాలు ఇంకా బాధితులను గుర్తించే పనిలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో సహాయక చర్యల్లో తీవ్ర అంతరాయం కలుగుతోంది.
గతంలోనూ భారీ నష్టమే – 2022 వరదలు గుర్తు చేస్తున్న పరిస్థితి
ఇది మొదటిసారి కాదు, 2022లోనూ నైజీరియాలో భారీ వరదలు సంభవించాయి. ఆ సమయంలో 14 లక్షల మంది నిరాశ్రయులవగా, 600 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక, సుమారు 4.40 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి పూర్తిగా నాశనమైంది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి తలెత్తడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వరదల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తక్షణమే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also :Hyderabad : ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం