హిమాలయ పర్వతాల్లో దాగి ఉన్న ఓ అణు పరికరం కథ ఇప్పటికీ భారత్‌ను ఆందోళనలో ముంచుతోంది. చైనా అణు పరీక్షలను గమనించేందుకు భారత్–అమెరికాలు కలిసి చేపట్టిన ఒక గూఢచార ఆపరేషన్, 60 ఏళ్లు గడిచినా పూర్తిగా ముగియని భయంగా మిగిలిపోయింది. ఉత్తరాఖండ్‌లోని నందా దేవి(NandaDevi) పర్వత శిఖరంపై వదిలిపెట్టిన ఒక ప్లూటోనియం ఆధారిత అణు పరికరం ఇప్పటికీ కనిపించకపోవడమే ఈ ఆందోళనలకు మూలం.
Read Also: Trump: భారత్ లో చిక్కుకుపోయిన హెచ్-1బీ వీసాదారులకు షాక్ మీద షాక్ లు

చైనా అణు పరీక్షలే ఈ ఆపరేషన్‌కు కారణం
1964లో చైనా తన తొలి అణు పరీక్షలు నిర్వహించడంతో అమెరికా అప్రమత్తమైంది. వెంటనే చైనా కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు భారత్(NandaDevi) సహకారాన్ని కోరింది. ఫలితంగా 1965లో అమెరికా సీఐఏ, భారత గూఢచార సంస్థలు కలిసి అత్యంత రహస్యంగా ఒక మిషన్‌ను ప్రారంభించాయి. నందా దేవి పర్వత శిఖరంపై అణు పరికరాన్ని ఏర్పాటు చేసి, దాని ద్వారా చైనా అణు పరీక్షలపై సమాచారం సేకరించాలని ప్రణాళిక రూపొందించారు.
SNAP-19C అణు జనరేటర్ మిషన్
ఈ మిషన్‌లో ఉపయోగించాల్సిన పరికరం SNAP-19C అనే ప్లూటోనియం ఆధారిత పోర్టబుల్ అణు జనరేటర్. దాదాపు 23 కిలోల బరువు ఉన్న ఈ పరికరంలో, నాగసాకిపై పడిన అణుబాంబులోని ప్లూటోనియంలో మూడవ వంతు భాగం ఉందని చెబుతారు. ఈ జనరేటర్‌ను పర్వత శిఖరంపై తీసుకెళ్లేందుకు భారత–అమెరికన్ పర్వతారోహక బృందాన్ని పంపారు. ఈ ఆపరేషన్‌కు కెప్టెన్ ఎం.ఎస్. కోహ్లీ నాయకత్వం వహించారు.
మంచు తుపాన్.. అదృశ్యమైన అణు పరికరం
పర్వతారోహకులు శిఖరానికి చేరుకున్న సమయంలో హఠాత్తుగా తీవ్ర మంచు తుపాన్ రావడంతో, భద్రత దృష్ట్యా బృందాన్ని వెనక్కి పిలిచారు. అయితే తిరిగి వస్తూ ఆ అణు జనరేటర్‌ను ఒక మంచు పగులులో ఉంచి, నైలాన్ తాడులు, మేకులతో బిగించి వదిలివేశారు.
1966 మేలో తిరిగి దాన్ని తీసుకొచ్చేందుకు వెళ్లిన బృందానికి షాక్ ఎదురైంది. కొండచరియలు విరిగిపడటంతో ఆ అణు పరికరం పూర్తిగా కనిపించకుండా పోయింది. 1967, 1968లో భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన అనేక శోధన ఆపరేషన్లు కూడా విఫలమయ్యాయి. అత్యాధునిక సెన్సార్లు వాడినా, దాని ఆచూకీ లభించలేదు.
గంగానదిపై పెరుగుతున్న పర్యావరణ భయాలు
ప్లూటోనియం అత్యంత ప్రమాదకరమైన రేడియోధార్మిక పదార్థం. ప్రస్తుతం హిమనీనదాలు కరుగుతున్న నేపథ్యంలో, ఆ అణు పరికరం బయటకు వచ్చి గంగా నది లేదా దాని ఉపనదుల్లో కలిసే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. గంగా నదిపై ఆధారపడి జీవించే కోట్లాది మందికి ఇది తీవ్ర ముప్పుగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2021లో నందా దేవి సమీపంలో జరిగిన ఘోర వరదలు, కొండచరియల పతనాలకు కూడా ఈ అణు పరికరం విడుదల చేసిన వేడి కారణమై ఉండొచ్చని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
ప్రభుత్వాల మౌనం.. మళ్లీ తెరపైకి వచ్చిన చర్చ
1970లలో ఈ రహస్య మిషన్ విషయం బయటకు రావడంతో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్, అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సమస్యను నిశ్శబ్దంగా పరిష్కరించేందుకు ప్రయత్నించారు. నిపుణుల కమిటీ నీటి నమూనాలను పరీక్షించి కాలుష్య ఆనవాళ్లు లేవని నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ, ప్రజల్లోని భయం మాత్రం పూర్తిగా తొలగలేదు. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, పర్యావరణవేత్తలు ఈ అంశాన్ని మళ్లీ లేవనెత్తుతున్నారు. అణు పరికరాన్ని వెలికి తీసి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
చివరి దశలో పశ్చాత్తాపం
ఈ మిషన్‌కు నాయకత్వం వహించిన కెప్టెన్ ఎం.ఎస్. కోహ్లీ తన చివరి ఇంటర్వ్యూలో తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం లేకుండా ఈ మిషన్‌లో పాల్గొన్నామని, ఇది మానవాళికి ప్రమాదకరమయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మాజీ గూఢచారి అధికారులు కూడా ఈ అణు పరికరం భవిష్యత్తులో పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: