రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Bengaluru)(ఆర్‌సీబీ) జట్టు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత టైటిల్ గెలిచి సంబరాలు మొదలయ్యాయని అభిమానులు అనుకున్నారు… కానీ అది చివరికి మరణమార్గమైంది. నిన్న బెంగళూరు (Bengaluru Stampede) లోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 47 మంది గాయపడ్డారు. ఈ ఘటన యావత్ క్రీడాలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తొక్కిసలాటలో నష్టమైంది యవ్వనమే
ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా 40 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. వీరిలో 13 ఏళ్ల బాలిక అత్యంత పిన్న వయస్కురాలు. ముగ్గురు టీనేజర్లు, 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు ఈ ఘటనలో ప్రాణాలు విడిచారు. మృతులను దివ్యాంశి (13), దొరేశ (32), భూమిక్ (20), సహాన (25), అక్షత (27), మనోజ్ (33), శ్రావణ్ (20), దేవి (29), శివలింగ (17), చిన్మయి (19), ప్రజ్వల్ (20)గా గుర్తించారు. వీరంతా తమ అభిమాన జట్టు విజయాన్ని ఆస్వాదించడానికి స్నేహితులతో కలిసి వచ్చారు. వీరిలో చాలా మంది బెంగళూరు నగరానికి చెందినవారు కాగా, కొందరు ఇతర జిల్లాల నుంచి కూడా తరలివచ్చారు.
అత్యుత్సాహంతో ప్రారంభమైన సంబరాలు, క్షణాల్లో విషాదంగా మారడానికి భద్రతా ఏర్పాట్ల వైఫల్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. హడావుడిగా చేసిన ఏర్పాట్లు, సరైన ప్రణాళిక లేకపోవడం, అంచనాలకు మించి అభిమానులు తరలిరావడం ఈ దుర్ఘటనకు దారితీశాయని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విధానసౌధలో జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా విమర్శలకు తావిస్తోంది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య(Sidda Ramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విధానసౌధ వద్ద వీఐపీల భద్రతకు పెద్ద సంఖ్యలో పోలీసులను కేటాయించడంతో, లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులను నియంత్రించడానికి చిన్నస్వామి స్టేడియం వద్ద పరిమిత సంఖ్యలోనే పోలీసులు అందుబాటులో ఉన్నారు. స్టేడియం సామర్థ్యం సుమారు 35వేలు కాగా, మూడు లక్షలకు పైగా జనం గుమిగూడినట్లు సమాచారం.

భద్రతా ఏర్పాట్ల వైఫల్యం – ఎవరి బాధ్యత?
వాస్తవానికి, భద్రతా కారణాల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీకి బెంగళూరు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు తెలిసింది. అయినప్పటికీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, జట్టు నిర్వాహకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 3.14 గంటల సమయంలో హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఆర్‌సీబీ యాజమాన్యం విజయోత్సవ ర్యాలీని ధృవీకరిస్తూ, ఉచిత పాసులను ప్రకటించింది. దీంతో స్టేడియం వద్దకు అభిమానులు వెల్లువెత్తారు. ప్రవేశం ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేకపోవడం, ‘ముందు వచ్చిన వారికి ముందు’ ప్రాతిపదికన అనుమతిస్తారనే వార్తలు వ్యాపించడంతో పరిస్థితి అదుపుతప్పింది. కొందరు గేట్లు ఎక్కడానికి ప్రయత్నించగా, మరికొందరు బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు కిందపడిపోవడంతో తొక్కిసలాట జరిగింది.
ప్రభుత్వం స్పందన – పరిహారం, కానీ తృప్తి కాదని ప్రజలు
భద్రతా ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… మృతుల కుటుంబాలకు పరిహారం, గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. “ఇలాంటి ఘటనలు ఎన్నో చోట్ల జరిగాయి. వాటితో పోల్చి దీన్ని సమర్థించుకోను. కుంభమేళాలో 50-60 మంది చనిపోయారు. కానీ నేను విమర్శించలేదు. కాంగ్రెస్ విమర్శిస్తే అది వేరే విషయం. నేను గానీ, కర్ణాటక ప్రభుత్వం గానీ విమర్శించామా?” అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి తీవ్రంగా స్పందించారు. “కుంభమేళాతో దీన్ని పోల్చడం సరికాదు.
పోలీసులు అనుమతి నిరాకరించినప్పుడు, మీరు వారిని ఎందుకు బలవంతం చేశారు? మరణాల తర్వాత కూడా మీరు సంబరాలు కొనసాగించారా? ఉపముఖ్యమంత్రి వారిని ఆహ్వానించడానికి ఎందుకు వెళ్లారు? వారు సెల్ఫీలతో బిజీగా ఉన్నారు, సామాన్యులకు ఏమైందో ఎవరూ పట్టించుకోవడం లేదు” అని జోషి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కుంభమేళా విషాద ఘటనను సున్నితంగా పరిష్కరించారని, అక్కడ ఎవరూ సెల్ఫీలు తీసుకోలేదని అన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. RCB గెలుపు ఓ పండుగ కావాల్సింది. కానీ వ్యవస్థాపక లోపాలు, అస్పష్ట కమ్యూనికేషన్, భద్రతా విఫలమవడం వంటి కారణాల వల్ల అది ప్రాణాల పంట నాశనానికి కారణమైంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం, స్పోర్ట్స్ ఫ్రాంచైజీలు భద్రతా ప్రాధాన్యతను గుర్తించాల్సిన అవసరం ఉంది.
Read Also: RCB: ఫ్రీ టిక్కెట్లు పంపిణీ చేస్తున్నారనే ప్రచారంతోనే ఉద్రిక్తత