Melania Trump Secures Ceasefire : రష్యా ఆక్రమణలో ఉన్న దక్షిణ ఉక్రెయిన్‌లోని ఒలెస్కీ నగరంలో తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వంతో రష్యా, ఉక్రెయిన్ ఈ ఒప్పందానికి అంగీకరించినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. యుద్ధం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పౌరులకు ఆహారం, మందులు, తాగునీరు అందించడంతోపాటు, అక్కడి నుంచి బయటకు వెళ్లాలనుకునే వారికి సురక్షిత మార్గం కల్పించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. 2026 అక్టోబర్ 29 నుంచి ఈ స్థానిక కాల్పుల విరమణ అమల్లోకి రావాల్సి ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఒలెస్కీ నగరంలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై మెలానియా ట్రంప్ దృష్టి సారించారు. అక్కడి ప్రజలకు అత్యవసర సహాయం అందించాల్సిన అవసరాన్ని గుర్తించిన ఆమె, ఇరు దేశాల నాయకత్వాలతో సంప్రదింపులు జరిపినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ చర్చల్లో మానవతా సాయం అందించే విధానం, కాల్పుల విరమణ అమలు సమయం, పౌరుల తరలింపు ప్రక్రియ వంటి అంశాలపై అంగీకారం కుదిరినట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో మెలానియా ప్రత్యేక మధ్యవర్తిగా వ్యవహరించినట్లు అమెరికా అధికారిక ప్రకటన పేర్కొంది.
Read Also: JIO IPO : జియో IPO.. రికార్డులే రికార్డులు

Melania Trump Secures Ceasefire : ఒలెస్కీలో దయనీయ పరిస్థితులు
ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ ప్రాంతంలో, డ్నిప్రో నదికి సమీపంలో ఒలెస్కీ నగరం ఉంది. 2022లో రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించిన సమయంలో ఈ నగరం రష్యా సైనికుల ఆధీనంలోకి వెళ్లింది. అప్పటి నుంచి అక్కడి ప్రజలు యుద్ధం, మౌలిక సదుపాయాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధానికి ముందు ఈ నగరంలో సుమారు 24 వేల మంది నివసించేవారు. ప్రస్తుతం అక్కడ దాదాపు 1,700 నుంచి 2,000 మంది మాత్రమే మిగిలి ఉన్నట్లు వైట్‌హౌస్ అంచనా వేసింది. వీరిలో ఎక్కువ మంది వృద్ధులు కాగా, సుమారు 50 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు పేర్కొంది. విద్యుత్ సరఫరా, ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం ప్రజల పరిస్థితిని మరింత దిగజార్చింది. రహదారులపై మందుపాతరలు ఉండటం, తరచూ దాడులు జరగడం వల్ల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం కూడా కష్టంగా మారింది.
కాల్పుల విరమణతో మానవతా సాయం
ఈ ఒప్పందం ప్రకారం, ఒలెస్కీ నగరంలో తాత్కాలికంగా సైనిక చర్యలను నిలిపివేసి, మానవతా సహాయ కార్యక్రమాలకు మార్గం సుగమం చేయనున్నారు. ఆహారం, మందులు, తాగునీరు వంటి అత్యవసర వస్తువులను ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే, రష్యా, ఉక్రెయిన్‌కు చెందిన పౌర ప్రతినిధులు అక్కడి ఇళ్లను సందర్శించి ప్రజల అవసరాలను గుర్తించనున్నట్లు మెలానియా ట్రంప్ కార్యాలయం తెలిపింది. సహాయం అవసరమైన కుటుంబాలకు తగిన ఏర్పాట్లు చేయడంతోపాటు, నగరాన్ని విడిచి వెళ్లాలనుకునే వారికి రవాణా సౌకర్యం కల్పించనున్నారు. ఒలెస్కీలో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఈ ఒప్పందంలో మరో కీలక అంశం. నగరాన్ని విడిచి వెళ్లాలనుకునే వారికి వారి అభీష్టం ప్రకారం రష్యా లేదా ఉక్రెయిన్ వైపు వెళ్లేందుకు సహకారం అందించనున్నట్లు మెలానియా ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రక్రియలో కుటుంబాల అభిప్రాయాలను గౌరవించడం, తరలింపు సమయంలో భద్రత కల్పించడం ప్రధాన ప్రాధాన్యాలుగా ఉండనున్నాయి. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల కార్యకలాపాలను నమోదు చేసేందుకు ఒక స్వతంత్ర అమెరికా మీడియా సంస్థను కూడా భాగస్వామిగా తీసుకురానున్నట్లు ఆమె కార్యాలయం తెలిపింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :