వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా మరియా కొరీనా మచాడో (Maria Corina Machado) పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. మదురోను అమెరికా బందీగా పట్టుకున్న తరుణంలో ఆమె ఎక్కడ ఉన్నారు? వెనిజులా భవిష్యత్తు ఏంటని చర్చలు జరుగుతున్నాయి. మరియా కొరీనా (Maria Corina Machado) 1967 అక్టోబర్ 7న జన్మించారు. ఆమె వృత్తిరీత్యా పారిశ్రామిక ఇంజనీర్. ఆమె 2011 నుండి 2014 వరకు వెనెజువెలా జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా పనిచేశారు.
Read also: America: ట్రంప్ చేతుల్లోకి వెనెజులా.. భారత్‌కు కలిసొచ్చేనా?
‘వెంటే వెనెజులా’ (Vente Venezuela) అనే రాజకీయ పార్టీకి ఆమె నాయకత్వం వహిస్తున్నారు. వెనెజులాలో నికోలస్ మదురో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న ధైర్యవంతమైన పోరాటానికి గాను ఆమెను ‘వెనెజులా ఐరన్ లేడీ’ అని పిలుస్తారు. వెనెజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ప్రజల హక్కుల కోసం ఆమె చేసిన అలుపెరగని కృషికి 2025 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి ఆమెను వరించింది.
మదురో ప్రభుత్వం ఆమెపై విధించిన ఆంక్షలు, ప్రాణహాని హెచ్చరికల కారణంగా మరియా కొరీనా మచాడో గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో గడిపారు. అయితే, డిసెంబర్ 2025లో ఆమె అత్యంత సాహసోపేతమైన రీతిలో వెనెజులా నుండి తప్పించుకుని నార్వే రాజధాని ఓస్లో చేరుకున్నారు. చేపల పడవల్లో సముద్ర మార్గంలో ప్రయాణించి, మదురో భద్రతా దళాల కళ్లుగప్పి ఆమె నార్వేకు చేరుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
భద్రతా కారణాల దృష్ట్యా ఆమె స్వయంగా అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోగా, ఆమె కుమార్తె ఆ బహుమతిని స్వీకరించారు. మచాడో ప్రస్తుతం నార్వే రాజధాని ఓస్లో (Oslo) లో ఉన్నట్లు సమాచారం. మదురోను అమెరికా పట్టుకున్న తర్వాత ఆమె ‘ఎక్స్’లో రియాక్ట్ అయ్యారు. “వెనెజువెలా ప్రజలారా.. స్వేచ్ఛా సమయం ఆసన్నమైంది” అంటూ భావోద్వేగపూరితమైన లేఖను విడుదల చేశారు. ఎడ్ముండో గొంజాలెజ్ వెనిజులా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని అందులో ఆమె కోరారు.

వెనెజులాలో తగినంత మద్దతు లేదు
మచాడోకు అంతర్జాతీయంగా భారీ మద్దతు ఉన్నప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మచాడో మంచి మహిళే కానీ, ఆమెకు వెనెజులాలో తగినంత మద్దతు లేదని, ఆమె దేశాన్ని నడపలేరని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి అమెరికానే వెనెజువెలా పాలనను పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పడం కొత్త వివాదాలకు దారితీస్తోంది. మదురో లేని వెనెజులాలో మచాడో మద్దతు ఇస్తున్న ఎడ్ముండో అధికారంలోకి వస్తారా?
లేక అమెరికా తనకిష్టమైన ప్లాన్ అమలు చేస్తుందా? అన్నది చూడాలి. అఫ్గానిస్థాన్, ఇరాక్ తరహాలో వెనెజులా కూడా అస్థిరతకు గురికాకుండా చూడటం మచాడో ముందున్న పెద్ద సవాలు.మరియా కొరీనా మచాడో కేవలం ఒక నాయకురాలు మాత్రమే కాదు, కోట్లాది మంది వెనెజులా ప్రజల ఆశల ప్రతిరూపం. ఆమె తిరిగి తన స్వదేశానికి చేరుకుని ప్రజాస్వామ్య పునరుద్ధరణలో ఎలాంటి పాత్ర పోషిస్తారో వేచి చూడాలి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: