ఘన చరిత్ర కలిగిన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం లోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో 270 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేకం (Maha Kumbhabhishekam) జరగబోతోంది. ఆలయం పునర్నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఈ మహా ఘట్టానికి ముహూర్తం ఖరారు చేశారు. ఆలయంలోని ఆధ్యాత్మిక శక్తిని బలోపేతం చేయడంతో పాటు మందిరం పవిత్రతను పరిరక్షించాలనే లక్ష్యంతో మహా కుంభాభిషేకాన్ని (Maha Kumbhabhishekam) తలపెట్టామని ఆలయం అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం గర్భగుడిపై మూడు కలశాలు, ఒట్టక్కల్ మండపంపై ఒక కలశాన్ని ఏర్పాటు చేశారు. వీటికి జూన్ 8న ప్రతిష్ఠాపన పూజలు నిర్వహించనున్నారు. ఆ రోజునే ఆలయంలో సరికొత్త విశ్వక్ సేన విగ్రహాన్ని ఏర్పాటుచేస్తారు. ఈ ఆలయం ప్రధాన ప్రాంగణంలోనే ఉన్న తిరువంబాడి శ్రీ కృష్ణ మందిరంలో అష్టబంధన కలశాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ వివరాలను పద్మనాభస్వామి ఆలయ మేనేజర్ బి.శ్రీకుమార్ వెల్లడించారు. జూన్ 8న ఆలయం కాంప్లెక్స్‌లోనే మహా కుంభాభిషేక పూజలు జరుగుతాయని, రాబోయే కొన్ని దశాబ్దాల్లోనూ ఆలయంలో ఈ తరహా ప్రత్యేక పూజలు జరిగే అవకాశం లేదన్నారు.

అనంత పద్మనాభ స్వామి ఆలయ విశిష్టత
సుప్రీంకోర్టు 2017లో నియమించిన నిపుణుల కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగానే పద్మనాభస్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు జరిగాయని బి.శ్రీకుమార్ తెలిపారు. 2017లో కమిటీ సిఫార్సులు చేసిన వెంటనే ఈ పనులు మొదలైనప్పటికీ, కరోనా కాలంలో అవి ఆగిపోయాయని చెప్పారు. తదుపరిగా 2021 నుంచి పలు విడతల్లో ఆలయం పునర్నిర్మాణ పనులను పూర్తి చేశారని ఆయన వెల్లడించారు. పద్మనాభస్వామి ఆలయంలో ఇంత పెద్దఎత్తున పునర్నిర్మాణ పనులు జరగడం, వాటికి సంబంధించిన పూజలు ఏకకాలంలో జరగనుండటం చాలా శతాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. ఈ విశేష పూజల్లో పాల్గొనడానికి పద్మనాభస్వామి భక్తులకు గొప్ప అవకాశం అని ఆలయ మేనేజర్ బి.శ్రీకుమార్ పేర్కొన్నారు. ఇంత భారీ పునర్నిర్మాణం జరగడం, దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఒకేసారి జరగడం శతాబ్దాల తర్వాత తొలిసారిగా నమోదవుతోంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఈ క్షేత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దేవస్థాన నిర్వహణ, సంప్రదాయ పూజా విధానాలు అత్యంత నిబద్ధతతో నిర్వహించబడతాయి. శ్రీ మహా విష్ణువు 108 దివ్య దేశాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రం తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. పాలకడలిలో శేషపాన్పుపై పవళించిన ఆ మూర్తి స్వరూపాన్ని ఇక్కడ దర్శించవచ్చు.
Read Also: Zelenskyy: రష్యాపై దాడి తర్వాత స్పందించిన జెలెన్ స్కీ