Venezuela gold transfer : వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో అరెస్టు తర్వాత ఆయనకు సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో మదురో వేల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని విదేశాలకు తరలించారని ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా బయటపడిన నివేదికల ప్రకారం, వెనెజువెలా ఆర్థికంగా కుదేలైన వేళ మదురో భారీగా బంగారం తరలించినట్టు తెలుస్తోంది.
2012–13 తర్వాత వెనెజువెలా తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. అప్పటి ప్రభుత్వం దేశాన్ని నిలబెట్టేందుకు బంగారం అమ్మకాలపైనా దృష్టి పెట్టింది. అయితే అదే సమయంలో, 2013 నుంచి 2016 మధ్యకాలంలో మదురో (Venezuela gold transfer) ప్రభుత్వం వెనెజువెలా సెంట్రల్ బ్యాంక్ నుంచి దాదాపు 113 మెట్రిక్ టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్‌కు తరలించినట్లు సమాచారం. భారత కరెన్సీ విలువ ప్రకారం దీని అంచనా విలువ సుమారు రూ.46 వేల కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు.
Read Also: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు
స్విట్జర్లాండ్‌కు తరలించిన ఈ బంగారం వెనెజువెలా సెంట్రల్ బ్యాంక్ నిల్వల నుంచే వెళ్లినట్లు స్విస్ బ్రాడ్‌కాస్టర్ ‘ఎస్‌ఆర్‌ఎఫ్’ ధ్రువీకరించింది. ప్రపంచంలోనే గోల్డ్ రిఫైనింగ్‌కు స్విట్జర్లాండ్ ప్రధాన కేంద్రం కావడంతో, అక్కడ శుద్ధి చేసి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ధ్రువీకరణ పొందేందుకే బంగారాన్ని పంపినట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే మరోవైపు, ఈ బంగారాన్ని మదురో వ్యక్తిగత ప్రయోజనాల కోసం దాచిపెట్టారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
2017 తర్వాత ఈ బంగారం ఎగుమతులు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. యూరోపియన్ యూనియన్ వెనెజువెలాపై ఆంక్షలు విధించడమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నారనే ఆరోపణలతో వెనెజువెలాకు చెందిన కీలక నేతలపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. 2018 తర్వాత స్విట్జర్లాండ్ కూడా ఈ ఆంక్షలను అమలు చేయడంతో బంగారం లావాదేవీలు నిలిచినట్లు తెలుస్తోంది.
మదురో అరెస్టు అనంతరం ఆయనతో పాటు అత్యంత సన్నిహితులైన మరో 36 మందికి సంబంధించిన ఆస్తులను స్విస్ బ్యాంకులు ఫ్రీజ్ చేసినట్లు సమాచారం. ఆ ఆస్తుల మొత్తం విలువ ఇంకా వెల్లడికాలేదు. సెంట్రల్ బ్యాంక్ నుంచి తరలించిన బంగారానికి, ఇప్పుడు స్తంభింపజేసిన ఆస్తులకు ఏమైనా సంబంధం ఉందా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: