భారత్-రష్యా దేశాలు దశాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారం పెంచుకుంటూ వచ్చాయి. తాజాగా ఈ సంబంధాలకు మరింత బలాన్ని చేకూర్చే నిర్ణయం రష్యా ప్రభుత్వం తీసుకుంది. రష్యా ఫెడరేషన్ సైన్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (Russian Federation Ministry of Science and Higher Education) డిప్యూటీ మంత్రి కాన్‌స్టాంటిన్ మొగిలెవ్‌స్కీ చేసిన ప్రకటన ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆయన స్పష్టంగా పేర్కొన్నది ఏమిటంటే, రష్యా విశ్వవిద్యాలయాల్లో హిందీ భాష బోధనను ప్రోత్సహించాలి అనే అంశం.
మొగిలెవ్‌స్కీ అభిప్రాయం ప్రకారం, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. ఇక్కడి ప్రజలు రోజువారీ జీవితంలో ఎక్కువగా హిందీనే వాడుతున్నారు. ఆంగ్లానికి ఉన్న ప్రాధాన్యతను ఆయన తిరస్కరించకపోయినా, హిందీకి ఉన్న విస్తృత వినియోగాన్ని రష్యా విద్యార్థులు తెలుసుకోవాలని కోరుతున్నారు. “మా దేశంలోని విద్యార్థులు భారతీయ సంస్కృతిని లోతుగా అర్థం చేసుకోవాలంటే, హిందీ నేర్చుకోవడం అవసరం” అని ఆయన అభిప్రాయపడ్డారు.
రష్యా నుంచి ముడి చమురును భారీగా దిగుమతి
రష్యా ప్రభుత్వం హిందీ భాషకు ఇస్తున్న ప్రాధాన్యత కేవలం రాజధాని మాస్కోకే పరిమితం కాలేదు. సెయింట్ పీటర్‌బర్గ్ స్టేట్ యూనివర్సిటీ (Saint Petersburg State University), కజాన్ ఫెడరల్ యూనివర్సిటీలతో పాటు రష్యాలోని అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో హిందీ నేర్చుకునే అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌తో వాణిజ్య యుద్ధం చేస్తున్న తరుణంలో రష్యా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముఖ్యంగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందనే కోపంతో.. ఆగస్టు 27వ తేదీన 50 శాతం అదనపు సుంకాలు విధించారు. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారతదేశం రష్యా నుంచి ముడి చమురును భారీగా దిగుమతి చేసుకునే ప్రధాన దేశంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారత్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే భారతదేశం మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

ఒక సదస్సులో
ప్రస్తుతం భారత్ తన సంప్రదాయ మిత్రదేశాలతో పాటు అమెరికా ప్రత్యర్థి దేశాలైన చైనా, రష్యా, ఉత్తర కొరియా వంటి దేశాలతోనూ సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. తియాన్‌జిన్‌లో నిర్వహించిన ఒక సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేతులు కలిపి నడుస్తున్న దృశ్యం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఇటీవల రష్యాతో భారతదేశ సంబంధాలు..
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన సంబంధాలలో ఒకటిగా అభివర్ణించారు.క్రెమ్లిన్ ధృవీకరించిన ప్రకారం.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా డిసెంబర్‌లో భారతదేశాన్ని అధికారికంగా సందర్శించనున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహపూర్వక బంధాన్ని మరింత దృఢపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ రష్యా-భారత్ సంబంధాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో స్పష్టం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రష్యాలో హిందీ భాషను ప్రోత్సహించడం కేవలం విద్యాపరమైన నిర్ణయం కాదని.. ఇది ఒక వ్యూహాత్మక దౌత్య అడుగు అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: