Earthquake: భారీ భూకంపంతో అతలాకుతలం అయిన మయన్మార్‌కు భారత్ అండగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. భారత వాయు సేనకు చెందిన C130J ప్రత్యేక విమానం హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయల్దేరి వెళ్లింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బాధితులకు అవసరమైన ఆహారపదార్థాలతోపాటు.. తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్‌కు పంపించినట్లు సమాచారం.

పేకమేడల్లా కూలిపోయిన బహుళ అంతస్తుల భవనాలు
నిమిషాల వ్యవధిలోనే శుక్రవారం సంభవించిన రెండు భారీ భూకంపాలు మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 154 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వందలాది మంది గాయపడ్డారు. బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కూలిపోయిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవంతి కూలిపోయిన ఘటనలో తాజాగా 10 మంది మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు.
బ్యాంకాక్‌లో తీవ్ర ఆస్తి నష్టం
ప్రాణ నష్టం అత్యధికంగా మయన్మార్‌లోని మాండలే నగరంలో చోటు చేసుకుంది. రెండు భూకంపాల కేంద్ర స్థానాలూ మయన్మార్‌లోని మాండలే నగరానికి సమీపంలోనే ఉన్నాయి. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. రెండు దేశాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో ఆత్యయిక పరిస్థితిని ప్రకటించాయి. భూప్రకంపనల ప్రభావం భారత్‌తో పాటు చైనా, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ కనిపించింది.