జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారానికి దిగింది భారత్. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను పెంచిపోషిస్తోన్న పాకిస్తాన్‌పై మిస్సైళ్లతో దాడి చేసింది. తెల్లవారు జామున 2 గంటల సమయంలో తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ దాడుల్లో జైషె మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాద క్యాంపులు ధ్వంసం అయ్యాయి. పలువురు ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వస్తోన్నాయి.

పేలుళ్ల కారణాలపై అనుమానాలు
ఈ పరిస్థితుల మధ్య లాహోర్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. సిటీ మొత్తం కూడా పేలుళ్లతో దద్దరిల్లింది.గోపాల్ నగర్, నజీరాబాద్, వాల్టన్ ఎయిర్‌పోర్ట్ వంటి ప్రాంతాల్లో ఈ పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. దట్టమైన పొగ ఆవరించింది ఆయా ప్రాంతాలన్నింటినీ. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పేలుళ్లు సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరావట్లేదు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు మొదలుపెట్టినట్లు లాహోర్ నగర పోలీస్ కమిషనర్ బిలాల్ సిద్ధికి కమ్యాన్ తెలిపారు. ఈ ఘటనతో లాహోర్ ఉలిక్కిపడింది. నగర ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. తొలుత భారత్ దాడి జరిపిందంటూ వార్తలొచ్చాయి. వాటిని పోలీసులు తోసిపుచ్చారు. నగరం మొత్తం హైఅలర్ట్ ప్రకటించారు. ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దని పోలీసులు అనౌన్స్‌మెంట్ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి అడుగు పెట్టవద్దని సూచించారు. పేలుడుకు గల కారణాల గురించి అన్వేషిస్తోన్నామని, తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ పేలుడు వల్ల ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎటువంటి వార్తలు అందలేదు.
Read Also: India: పాకిస్థాన్‌కు 25 గగనతల మార్గాలు నిలిపివేసిన భారత్