అమెరికా మోంటానా (Montana crime) రాష్ట్రంలోని అనకొండ నగరంలో కాల్పుల ఘటన సంచలనం రేపింది. ఓ బార్‌లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు వ్యాపించాయి.శుక్రవారం రాత్రి అనకొండలోని ‘ది అవుల్ బార్’ (‘The Owl Bar’) లో ఈ దారుణం జరిగింది. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని మైఖేల్ పాల్ బ్రౌన్‌గా పోలీసులు గుర్తించారు. అనకొండ-డీర్ లాడ్జ్ కౌంటీ అధికారులు నిందితుడి ఫోటోను ఫేస్‌బుక్‌లో విడుదల చేశారు.బ్రౌన్ ప్రమాదకరమైన ఆయుధంతో తిరుగుతున్నాడని పోలీసులు హెచ్చరించారు. అనుమానితుడు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భారీ పోలీసు మోహరింపు
కాల్పుల అనంతరం పోలీసులు అనకొండ పశ్చిమ ప్రాంతంలో విస్తృతంగా మోహరించారు. స్టంప్‌టౌన్ రోడ్, అండర్సన్ రాంచ్ లూప్ రోడ్ పరిసరాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మోంటానా హైవే పెట్రోల్ ప్రజలను ఆ ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది.కాల్పుల వార్త తెలిసిన వెంటనే పట్టణ ప్రజల్లో ఆందోళన నెలకొంది. వ్యాపారులు వెంటనే దుకాణాలు మూసివేశారు. కస్టమర్లతో సహా లోపలే ఉండిపోయారు. “మోంటానాలో తుపాకులు సాధారణమే. కానీ పట్టణాన్ని ఇలా లాక్‌డౌన్ చేయడం మాకు కొత్త” అని స్థానిక కేఫ్ యజమాని బార్బీ నెల్సన్ తెలిపారు.
పిల్లల భద్రతా చర్యలు
కాల్పులు జరిగిన ప్రదేశానికి సమీపంలోని ఒక నర్సరీ స్కూల్ యాజమాన్యం పిల్లలను రోజంతా లోపలే ఉంచింది. ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది.మైఖేల్ పాల్ బ్రౌన్ ఇంకా పట్టుబడకపోవడంతో పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశారు. ఈ ఘటనతో అనకొండ పట్టణం భయంతో వణికిపోతోంది.
Read Also : NTR War 2 : యూకేలో ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ హంగామా : యుద్ధ ట్యాంకర్లతో ర్యాలీ