ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద దేశాలలో ఒకటైన నైజీరియా ఇటీవలి కొన్ని రోజులుగా భారీ వర్షాల ధాటిని ఎదుర్కొంటోంది. ఈ వర్షాల కారణంగా ఆ దేశంలో పలు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. లక్షలాది మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆఫ్రికా దేశం నైజీరియా (Nigeria)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ వర్షాల కారణంగా సంభవించిన వరదలు (floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.నైగర్ రాష్ట్రంలోని మోక్వా (Mokwa) పట్టణంలో భారీ వరదలతో మరణించినవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. దాదాపు 700 వందల వరకూ ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.

పట్టణాన్ని ముంచెత్తిన వరదలు
అకస్మాత్తుగా కుండపోత వర్షం కురవడంతో దాదాపు ఐదు గంటల్లోనే భారీ వరద పట్టణాన్ని ముంచెత్తిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ వరదలకు ఇప్పటి వరకూ 200కి పైగా మృతదేహాలను గుర్తించారు. మరో 500 మంది ఆచూకీ గల్లంతైంది. వారంతా వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారిలో ఎవరూ సజీవంగా ఉండే అవకాశం లేనందున సహాయక చర్యలు నిలిపివేస్తున్నట్లు స్థానిక అధికారి ముసా కాంబోకు విలేకరులకు తెలిపారు.
స్తంభించిన రాకపోకలు
నైగర్ రాష్ట్రంలో వాణిజ్యపరంగా మోక్వా కీలక ప్రాంతం. ఇక్కడ భారీ ఎత్తున క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని అకస్మాత్తుగా వరదలు ముంచెత్తడంతో ప్రాణ నష్టం అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టణానికి రాకపోకలు సాగించే రెండు రోడ్లు, రెండు బ్రిడ్జీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయన్నారు. ఇక ఈ వదరలకు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. అనేక మంది గాయపడ్డారు.
వరదల కారణంగా అనేక ఇళ్లను, పంట భూములను, రహదారులను ముంచెత్తాయి. ఆహార కొరత కూడా తలెత్తే అవకాశం ఉన్నదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులకు ఇది భారీ నష్టంగా మారింది.
నైజీరియా ప్రభుత్వం ఎమర్జెన్సీ సేవలను రంగంలోకి దించింది. రెడ్ క్రాస్ వంటి సంస్థలు సహాయక చర్యలు చేపట్టాయి. నిరాశ్రయులైన వారికి తాత్కాలిక ఆశ్రయాల ఏర్పాట్లు చేస్తుండగా, దాతల నుండి సాయం అందుతున్నది.
Read Also :Ukraine: రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ స్పైడర్ వెబ్ దాడి